కలం, నకిరేకల్: విద్యారంగం అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రభుత్వ విప్, నకిరేకల్ శాసనసభ్యులు వేముల వీరేశం (MLA Vemula Veeresham) అన్నారు. ఇందులో భాగంగా విద్యార్థులకు ఆధునిక సౌకర్యాలతో విద్యాసంస్థలను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ప్రజా పాలన- ప్రగతి ప్రణాళికలో భాగంగా మే 11 నుండి 17 వరకు నిర్వహిస్తున్న విద్యా వారోత్సవం సందర్భంగా సోమవారం ఆయన నల్గొండ జిల్లా నకిరేకల్ నియోజకవర్గం కట్టంగూర్ మండల కేంద్రంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 40.50 లక్షల రూపాయల పీఎం శ్రీ పాఠశాల నిధుల ద్వారా నిర్మించిన రెండు అదనపు తరగతి గదులను, ల్యాబ్‌ను ప్రారంభించారు. అలాగే కేజీవీబీ పాఠశాలలో 38.50 లక్షల రూపాయలతో నిర్మించనున్న కాంపౌండ్ వాల్, సెప్టిక్ ట్యాంక్ పనులకు శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ వేముల వీరేశం మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం విద్యా రంగంలో దేశంలోనే గొప్ప మార్పులకు శ్రీకారం చుట్టిందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రతి నియోజకవర్గానికి ఒక యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలతో పాటు తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటు చేస్తున్నామని ,ఒకే ప్రాంగణంలో 1650 మంది విద్యార్థులు చదివేలా అత్యాధునిక సౌకర్యాలతో పాఠశాలలను అభివృద్ధి చేస్తున్నామన్నారు. విద్యార్థులకు బ్రేక్‌ఫాస్ట్, మధ్యాహ్న,రాత్రి భోజనం, క్రీడా మైదానాలు, వసతి వంటి అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని తెలిపారు. ప్రతి విద్యార్థిపై ప్రభుత్వం సంవత్సరానికి రూ.50 వేల వరకు ఖర్చు చేస్తోందన్నారు. జిల్లా కలెక్టర్ బి.చంద్రశేఖర్ మాట్లాడుతూ.. ఎంత ఎదిగినా విద్య మాత్రమే శాశ్వతంగా ఉంటుందని, విద్యార్థులు చదువుతో పాటు తమ ప్రతిభను పెంపొందించుకోవాలని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగ అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని, ప్రతి నియోజకవర్గానికి రూ.200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ మరియు తెలంగాణ పబ్లిక్ స్కూల్స్‌ను మంజూరు చేసిందన్నారు. ప్రభుత్వం నిర్వహిస్తున్న వేసవి శిక్షణ శిబిరాల్లో విద్యార్థులు డ్రాయింగ్, సింగింగ్, సెల్ఫ్ డిఫెన్స్, కంప్యూటర్ శిక్షణ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఆర్ట్స్ & క్రాఫ్ట్స్, సైన్స్, క్రీడలు వంటి తమకు ఇష్టమైన అంశాల్లో శిక్షణ పొందాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి బిక్షపతి, తహసిల్దార్ పుష్పలత, ఎంఈఓ అంజయ్య, ఎంపీడీవో జ్ఞాన ప్రకాష్ ,ఏఈ వెంకట నరసయ్య, సర్పంచ్ శ్యామల శేఖర్, మాజీ జెడ్పిటిసి మాదా యాదగిరి, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

