కలం, ఖమ్మం బ్యూరో: భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri Kothagudem) జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో వైద్య నిర్లక్ష్యం మరోసారి వెలుగుచూసింది. సకాలంలో 108 అంబులెన్స్ అందుబాటులోకి రాకపోవడం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లేసరికి తాళం వేసి ఉండటంతో ఓ గర్భిణీ తీవ్ర వేదన అనుభవిస్తూ ఆటోలోనే ప్రసవించిన ఘటన పినపాక (Pinapaka) మండలంలో చోటుచేసుకుంది. పినపాక మండలం అమరారం గ్రామానికి చెందిన కలివేటి సంధ్యకు గురువారం అర్ధరాత్రి అకస్మాత్తుగా పురిటి నొప్పులు ప్రారంభమయ్యాయి. ఇది ఆమెకు తొలి కాన్పు కావడంతో కుటుంబ సభ్యులు వెంటనే 108 అంబులెన్స్‌కు సమాచారం ఇచ్చారు. అయితే గిరిజన ప్రాంతానికి కేటాయించిన 108 వాహనం మరో ప్రాంతానికి తరలించబడటంతో అది అందుబాటులోకి రాలేదు.
దీంతో విధిలేని పరిస్థితుల్లో కుటుంబ సభ్యులు ఆటోను ఏర్పాటు చేసి సంధ్యను జానంపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లారు. అయితే అక్కడికి చేరుకున్న తర్వాత పీహెచ్‌సీ మూసివేసి ఉండటంతో తీవ్ర నిరాశకు గురయ్యారు. అనంతరం ఆమెను పినపాక పీహెచ్‌సీకి (Pinapaka PHC) తరలించేందుకు ఆటోలో బయలుదేరగా, మార్గమధ్యంలోనే పురిటి నొప్పులు తీవ్రం కావడంతో సంధ్య ఆటోలోనే ఓ శిశువుకు జన్మనిచ్చింది. ప్రసవ సమయంలో తీవ్ర రక్తస్రావం కావడంతో గర్భిణీ తీవ్ర ఇబ్బందులు పడింది. అనంతరం తల్లి, శిశువును మణుగూరులోని 100 పడకల ఆసుపత్రికి తరలించగా, ప్రస్తుతం ఇద్దరూ క్షేమంగా ఉన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
ఈ ఘటనపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వాలు మారుతున్నా ఏజెన్సీ ప్రాంతాలలో వైద్య సేవలు, మౌలిక సదుపాయాలు మెరుగుపడడం లేదని విమర్శిస్తున్నారు. రాత్రి వేళల్లో పీహెచ్‌సీలు మూసివేయడం, అత్యవసర పరిస్థితులలో అంబులెన్స్ అందుబాటులో లేకపోవడం వంటి సమస్యలతో గిరిజనులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా జిల్లా యంత్రాంగం స్పందించి ఏజెన్సీ ప్రాంతాలలో 24 గంటల వైద్య సేవలు, నిరంతర అంబులెన్స్ సౌకర్యం కల్పించాలని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
Read Also: దిక్కు లేని వృద్ధ కళాకారుడు.. అండగా నిలిచినా ఆనంద్ మహీంద్రా
Follow Us On: Instagram

