కలం, కరీంనగర్ బ్యూరో: ప్రజల ఆరోగ్యాన్ని కాపాడే విషయంలో ప్రభుత్వాసుపత్రుల పాత్ర ఎంతో కీలకమని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ (Adluri Laxman Kumar) పేర్కొన్నారు. జగిత్యాల జిల్లా బీర్‌పూర్ మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, జిల్లా కలెక్టర్ బి.సత్యప్రసాద్‌తో కలిసి శుక్రవారం ఘనంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ (Adluri Laxman Kumar) మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలను అందించేందుకు అత్యంత ప్రాధాన్యతనిస్తోందని తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచితంగా అందుతున్న వైద్య సేవలను ప్రజలు పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని మంత్రి సూచించారు. ప్రభుత్వ వైద్య సంస్థలపై ప్రజల్లో మరింత విశ్వాసం పెరిగేలా అధికారులు సేవలందించాలని కోరారు. గ్రామీణ ప్రజలకు సకాలంలో వైద్య సేవలు అందడం ద్వారా తీవ్రమైన ఆరోగ్య సమస్యలను ముందుగానే నివారించవచ్చని చెప్పారు.
అందరూ సద్వినియోగం చేసుకోవాలి..
జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ (Sanjay Kumar) మాట్లాడుతూ.. బీర్‌పూర్‌లో నూతనంగా ప్రారంభమైన ఈ ఆరోగ్య కేంద్రం పరిసర ప్రాంత ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా నిలుస్తుందని తెలిపారు. గర్భిణులు, బాలింతలు, చిన్నారులు, వృద్ధులు సహా అన్ని వర్గాల ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుతాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ప్రభుత్వ ఆరోగ్య కార్యక్రమాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.
వైద్యులు అందుబాటులో ఉండాలి..
జిల్లా కలెక్టర్ బి.సత్యప్రసాద్ మాట్లాడుతూ.. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అన్ని వైద్య సేవలు సమర్థవంతంగా అందేలా అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అవసరమైన వైద్యులు, సిబ్బంది, మందులు, వైద్య పరికరాలు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాలని సూచించారు. రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించడంలో ఎలాంటి నిర్లక్ష్యం ఉండకూడదని కలెక్టర్ స్పష్టం చేశారు. అనంతరం మంత్రి, ఎమ్మెల్యే, జిల్లా కలెక్టర్ ఆసుపత్రిలోని వివిధ విభాగాలను పరిశీలించి సౌకర్యాలను పరిశీలించారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా. సుజాత, వైద్యులు, వైద్య సిబ్బంది, వివిధ శాఖల అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
Read Also: రైతులకు సోలార్ ‘పంట’.. త్వరలో పైలట్ ప్రాజెక్టు ప్రారంభం
Follow Us On: Instagram

