epaper
Wednesday, February 18, 2026
epaper

మేడారం హుండీల ఆదాయం ఎవరికెంత?

కలం, వరంగల్ బ్యూరో : ఆదివాసీ కుంభమేళా మేడారం మహా జాతర (Medaram Maha Jatara) ముగిసింది. సమ్మక్క సారలమ్మ గద్దెల వద్ద ఏర్పాటు చేసిన హుండీల్లో భారీగా కానుకలు వచ్చాయి. మొత్తం 788 హుండీల్లో వచ్చిన ఆదాయం లెక్కింపు ప్రక్రియ గురువారం ప్రారంభించారు. అయితే ఈ హుండీల ద్వారా వచ్చిన డబ్బును ఆదివాసీ పూజారులతో పాటు దేవాదాయశాఖకు పంచడం ఆనవాయితీగా వస్తోంది. అయితే ఆదివాసీ పూజారులకు ఎంత మొత్తం చెల్లిస్తారు. మిగిలిన ఆదాయం ఏం చేస్తారు? అనే విషయాలపై ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది.

పెరగనున్న ఆదాయం

గత జాతరకంటే ఈ జాతర (Medaram Maha Jatara)లో ఎక్కువ హుండీలు ఏర్పాటు చేశారు. గత జాతరకు 540 హుండీలు ఏర్పాటు చేస్తే ఈసారి 828 హుండీలను ఏర్పాటు చేసారు. ఈసారి హుండీల ఆదాయం కూడా పెరిగే అవకాశం ఉంది. ఈ హుండీల ద్వారా వచ్చిన ఆదాయంలో ప్రధానంగా గిరిజన పూజారులకు 33% దేవాదాయ శాఖకు 67% వాటాలుగా విభజిస్తారు. వచ్చిన మొత్తాన్ని లెక్కించి తొలుత దేవాదాయశాఖ అకౌంట్ లో జమ చేస్తారు. ఆ తర్వాత పూజారులకు 33 శాతం అందజేస్తారని మేడారం ఈఓ వీరేశం పేర్కొన్నారు.

పూజారులకు సమాన వాటాలు

సమ్మక్క సారలమ్మ హుండీల ఆదాయంలో 33 శాతం 13 మంది గిరిజన పూజారులకు సమానంగా పంచుతారు. 13 వాటాల్లో ఒకటి పగిడిద్దరాజు పూజారులు, మరొక వాటా గోవిందరాజు పూజారులకు అందజేస్తారు. మిగిలిన 11 వాటాల్లో 6 సారలమ్మ పూజారుల వాటాలు కాగా… 5 సమ్మక్క పూజారుల వాటాలున్నాయి. అయితే తమకు ఎప్పటి నుంచో అన్యాయం జరుగుతోందని సమ్మక్క ప్రధాన పూజారి సిద్దబోయిన జగ్గారావు ఆరోపిస్తున్నారు. వాటాల విషయంలో తాము అసంతృప్తిగా ఉన్నామని చెబుతున్నారు. సమ్మక్క బిడ్డగా ఉన్న సారలమ్మకు 6 వాటాలు ఇచ్చి తల్లి సమ్మక్కకు 5 వాటాలు ఇవ్వడం ఏంటని ఆయన ప్రశ్నిస్తున్నారు.

67 శాతం దేవాదాయ శాఖకు

ఆదివాసీల పూజారుల వాటాలా పంచాయితీ పై విధంగా ఉంటే మిగిలిన 67% తెలంగాణ దేవాదాయ శాఖకు చెందుతుంది. ఆ డబ్బును దేవాలయ నిర్వహణ, ఇతర ఖర్చులకు ఉపయోగిస్తారు. ఈ విభజన ప్రక్రియ జాతర తర్వాత 15 రోజుల్లోపు పూర్తి అవుతుంది, నగదు, బంగారం, వెండి సహా గత మహా జాతరలో మొత్తం 13.25 కోట్ల రూపాయల హుండీ ఆదాయం వచ్చింది. ఈసారి అంతకు మించిన ఆదాయం సమకూరుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

హుండీల తొలిరోజు ఆదాయం రూ. 2.49 కోట్లు

మేడారం సమ్మక్క సారలమ్మ హుండీల తొలిరోజు ఆదాయం రూ. 2. 49 కోట్లు వచ్చింది. మొత్తం 828 హుండీలకు గాను 780 హుండీల్లో అమ్మవార్ల కు కానుకలు వచ్చాయి. మొదటిరోజు 125 హుండీలను తెరిచి లెక్కించగా రూ. 2. 49 కోట్ల ఆదాయం సమకూరినట్లు దేవాదాయశాఖ అధికారులు వెల్లడించారు.

Read Also: కాంగ్రెస్ – బీఆర్ఎస్ తోడు దొంగలు : కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>