కలం, మెదక్ బ్యూరో : వేసవి ప్రారంభంలోనే మెదక్ (Medak) జిల్లాలోని భూగర్భ జలాలు తగ్గిపోతున్నాయి. ఎండలు పెరుగుతున్న నేపథ్యంలో బావులు, బోర్లలో నీరు అడుగంటుతోంది. జిల్లాలో గతేడాది ఫిబ్రవరిలో 13.25 మీటర్లలకు పడిపోతే ఈసారి 10.67 మీటర్లకు లోతుకు పడిపోయాయి. కొన్నేళ్లుగా అధికంగా బోర్లు తవ్వడం, నీటి వినియోగంలో నియంత్రణ లేకపోవడంతో పాటు లోటు వర్షపాతంతో నీటి మట్టం దిగజారుతున్నది. వేసవికాలం ప్రారంభంలోనే అధిక మండలాల్లో భూగర్భ జలాలు తగ్గిపోవడంతో సాగు, తాగునీటి సమస్య వచ్చే అవకాశం కనిపిస్తుంది ఉంది. వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకుని తాగునీటి ఎద్దడి నివారణకు జిల్లా (Medak) లో స్పెషల్ సమ్మర్ యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తున్నారు అధికారులు.
ప్రగతి ప్రణాళిక భాగంగా.. ప్రత్యేక కార్యచరణ
ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యచరణలో భాగంగా వేసవిలో జిల్లాలో ప్రజలకు తాగునీటి సమస్య తలెత్తకుండా సమ్మర్ యాక్షన్ ప్లాన్ ద్వారా పటిష్ట చర్యలు తీసుకుంటున్నారు. మెదక్ జిల్లాలోని 917 హ్యాబిటేషన్లలో నివసిస్తున్న 1,76,170 కుటుంబాలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తాగునీటి సరఫరా జరిగేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. సురక్షిత తాగునీరు అందించడమే లక్ష్యంగా జిల్లాలో ఉన్న 1485 తాగునీటి ట్యాంకులను శుభ్రం చేయాలని అధికారులు నిర్ణయించారు. ఎక్కడైనా నీటి ఎద్దడి తలెత్తిన వెంటనే యుద్ధప్రాతిపదికన ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలని, అవసరమైన చోట చేతిపంపులు, బోరు మోటార్లు, పైపు లైన్ల మరమ్మతులు సకాలంలో పూర్తి చేయాలని ప్రణాళికను సిద్ధం చేశారు. అవసరమైతే గ్రామపంచాయతీ ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేపట్టాలని నిర్ణయించారు.
సమన్వయంతో పనిచేయాలి : కలెక్టర్ ప్రతిమా సింగ్
వేసవిలో తాగునీటి సరఫరా అంశం అత్యంత కీలకమైనదని, క్షేత్రస్థాయిలో ప్రతిరోజూ పకడ్బందీగా పర్యవేక్షంచాలని మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ అధికారులకు సూచించారు. మంగళవారం కలెక్టరేట్ లో మిషన్ భగీరథ, ఇరిగేషన్, అర్ డబ్ల్యూఎస్, గ్రామపంచాయతీ, గ్రౌండ్ వాటర్, మున్సిపల్ కమిషనర్స్, ఫారెస్ట్ వివిధ శాఖల అధికారులతో వేసవికాలంలో తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలపై కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. మిషన్ భగీరథ ద్వారా నిర్ణీత పరిమాణంలో నీరు సరఫరా అవుతోందో లేదో మండల అధికారులు, గ్రామ పంచాయతీ కార్యదర్శులు నిర్ధారించుకోవాలని సూచించారు. సంబంధిత శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో పని చేస్తూ ఈ వేసవిలో ఏ ఒక్క నివాస ప్రాంతంలోనూ నీటి సమస్య తలెత్తకుండా నిబద్ధతతో పని చేయాలన్నారు. జిల్లా స్థాయి అధికారులు మారుమూల గ్రామాలను సందర్శించి వాస్తవ పరిస్థితిని తెలుసుకోవాలని ఆదేశించారు. ప్రస్తుతం వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకుని మిషన్ భగీరథ ఆర్ డబ్ల్యూఎస్, మున్సిపల్ కమిషనర్ సమిష్టిగా పని చేయాలన్నారు. జిల్లా అటవీ శాఖ ఆధ్వర్యంలో వన్య ప్రాణులకు దప్పిక తీర్చేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ప్రతిమా సింగ్ ఆదేశించారు.

