Mobile Popup Ad
Mobile Popup Ad

క్లీన్ సిటీతో పాటు గ్రీన్ సిటీగా కరీంనగర్: కొలగాని

కలం, కరీంనగర్ బ్యూరో: వర్షాకాలం ముందస్తు ప్రణాళికలో భాగంగా నిర్వహించనున్న వనమహోత్సవ కార్యక్రమంపై నగరపాలక సంస్థ సమావేశ మందిరంలో నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ (Mayor Kolagani Srinivas) అధ్యక్షతన అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ.. కరీంనగర్‌ను పరిశుభ్రమైన ‘క్లీన్ సిటీ’గా కొనసాగించడమే కాకుండా, పచ్చదనంతో కళకళలాడే ‘గ్రీన్ సిటీ’ గా తీర్చిదిద్దడం నగరపాలక సంస్థ ప్రధాన లక్ష్యమని తెలిపారు. భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన వాతావరణం, సమృద్ధిగా ఆక్సిజన్ అందేలా రాబోయే ఐదేళ్లలో నగరాన్ని పూర్తిస్థాయి గ్రీన్ సిటీగా మార్చేందుకు వనమహోత్సవాన్ని ప్రజా ఉద్యమంగా నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో భాగంగా నగరవ్యాప్తంగా 4 లక్షల మొక్కలు నాటాలని లక్ష్యంగా నిర్ణయించారు. ఇందులో సుమారు 3 లక్షల మొక్కలను ఇంటింటికీ పంపిణీ చేయనున్నారు. ప్రతి ఇంటికి మూడు పండ్ల లేదా పూల మొక్కలను అందించనున్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ప్రత్యేక డీజిల్ ఆటోల ద్వారా మొక్కలను నేరుగా వారి ఇళ్ల వద్దకే పంపిణీ చేసే ఏర్పాట్లు చేస్తున్నారు. మిగిలిన ఒక లక్ష మొక్కలను నగరంలోని ఖాళీ స్థలాలు, ప్రధాన రహదారుల ఇరువైపులా అవెన్యూ ప్లాంటేషన్ రూపంలో నాటనున్నారు.

కొత్తగా నగరంలో విలీనమైన మల్కాపూర్, కొత్తపల్లి, గోపాలపురం, దుర్షేడ్, బొమ్మకల్ తదితర గ్రామాల్లో విస్తృత స్థాయిలో ప్లాంటేషన్ చేపట్టాలని నిర్ణయించారు. ముఖ్యంగా 50 అడుగులు, 100 అడుగుల రహదారుల ఇరువైపులా మొక్కలు నాటడంతో పాటు, చెరువు కట్టలు, ఖాళీ ప్రభుత్వ స్థలాల్లో కూడా పెద్దఎత్తున మొక్కలు నాటనున్నారు. స్థానిక కార్పొరేటర్లు, అధికారులు, సిబ్బంది సమన్వయంతో అనువైన ప్రదేశాలను గుర్తించాలని సూచించారు.

శివారు ప్రాంతాల్లో ఖాళీ స్థలాలను గుర్తించి బ్లాక్ ప్లాంటేషన్ చేపట్టాలని నిర్ణయించారు. ఈ ప్లాంటేషన్‌లో అధిక సంఖ్యలో పండ్ల మొక్కలు పెంచడం ద్వారా కోతులు నగర జనావాసాల్లోకి రాకుండా నియంత్రించవచ్చని మేయర్ తెలిపారు. మొక్కలు నాటడమే కాకుండా వాటి సంరక్షణకు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నట్లు పేర్కొన్న మేయర్, మొక్కలకు నిరంతర నీటి సరఫరా కోసం ఇప్పటికే ఐదు బోరుబావులు మంజూరు చేసినట్లు తెలిపారు. నీటి ట్యాంకర్లపై ఆధారపడకుండా పైపుల ద్వారా డ్రిప్ ఇరిగేషన్ విధానాన్ని అమలు చేసే దిశగా కార్యాచరణ రూపొందిస్తున్నట్లు వెల్లడించారు.

వర్షాకాలాన్ని సద్వినియోగం చేసుకొని అధికారులు, ఇంజినీరింగ్ విభాగం సిబ్బంది క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ స్థానిక కార్పొరేటర్లు, డీఈలతో సమన్వయం చేసుకొని మొక్కలు నాటేందుకు అనువైన స్థలాలను వెంటనే గుర్తించాలని మేయర్ ఆదేశించారు. ఖర్చు చేసిన ప్రతి రూపాయికి, నాటిన ప్రతి మొక్కకు సార్థకత చేకూరేలా ప్రతి ఒక్కరూ బాధ్యతతో పనిచేసి కరీంనగర్‌ను ఆకుపచ్చని నగరంగా తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు.

ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్, అదనపు కమిషనర్లు సువార్త, మొహమ్మద్ అయాజ్, ఇంజినీరింగ్ అధికారులు, సంబంధిత శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>