కలం, ఖమ్మం బ్యూరో: మీసేవ కేంద్రాల్లో ప్రభుత్వం నిర్ణయించిన సేవా రుసుములకు మించి ఎట్టి పరిస్థితుల్లోనూ అదనపు వసూళ్లు చేయరాదని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri Kothagudem) జిల్లా అదనపు కలెక్టర్ వేణుగోపాల్ (Additional Collector Venugopal) హెచ్చరించారు. బుధవారం బూర్గంపాడు, భద్రాచలం మండల తహసీల్దార్ కార్యాలయాల్లో మీసేవ కేంద్రాల నిర్వహణపై ఆయన ప్రత్యేక సమీక్షా సమావేశాలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలకు వేగవంతమైన, పారదర్శకమైన, నాణ్యమైన సేవలు అందించడమే లక్ష్యంగా ప్రతి కేంద్రంలో ప్రభుత్వ నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలని ఆదేశించారు. మీసేవ కేంద్రాలు నిర్ణీత పని వేళలను తప్పనిసరిగా పాటించాలని, ప్రభుత్వం ప్రవేశపెట్టిన డిజిటల్ రసీదుల విధానాన్ని సమర్థవంతంగా అమలు చేయాలన్నారు. కాగితపు రసీదులకు బదులుగా దరఖాస్తుదారుల మొబైల్‌కు సందేశం పంపాలని, అవసరమైతేనే ఈ-ప్రింట్ సౌకర్యాన్ని కల్పించాలని సూచించారు.
దరఖాస్తుదారుల నుంచి అవసరం లేని భౌతిక పత్రాలను మండల రెవెన్యూ కార్యాలయాలు కోరకూడదని స్పష్టం చేశారు. అలాగే, దరఖాస్తులకు సంబంధించిన అసలైన పత్రాలను మాత్రమే స్పష్టంగా స్కాన్ చేసి అప్లోడ్ చేయాలని, రికార్డులను సక్రమంగా నిర్వహించాలన్నారు. కేంద్రాలకు వచ్చే ప్రజలతో మర్యాదపూర్వకంగా వ్యవహరిస్తూ, ఎలాంటి అసౌకర్యం కలగకుండా పారదర్శకతతో సేవలు అందించి ప్రభుత్వంపై విశ్వాసాన్ని పెంపొందించాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశాల్లో తహసీల్దార్ ప్రసాద్, ఈ-డిస్ట్రిక్ట్ మేనేజర్ సైదేశ్వరరావు, జిల్లా మేనేజర్ కృష్ణమూర్తి, జీపీఓలు, ఆర్‌ఐలు, మీసేవ వీఎల్‌ఈలు పాల్గొన్నారు.

