కలం, ఖమ్మం బ్యూరో: సైబర్ మోసాలతో (Cyber Fraud) డబ్బులు కోల్పోయిన బాధితులకు కోర్టుల చుట్టూ తిరిగే పని లేకుండా, త్వరితగతిన న్యాయం చేసేందుకు సరికొత్త సాంకేతిక అస్త్రాలు అందుబాటులోకి వచ్చాయి. సైబర్ నేరాల్లో రూ. 50,000 లోపు నష్టపోయిన బాధితులకు ఎలాంటి కోర్టు ఉత్తర్వులు లేకుండానే, నిబంధనల ప్రకారం పరిశీలించి ఆ మొత్తాన్ని తిరిగి అందించే అవకాశం ‘మనీ రెస్టోరేషన్ మాడ్యూల్’ (MRM) ద్వారా కలగనుంది.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు (SP Rohith Raju) ఆదేశాల మేరకు బుధవారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో సైబర్ క్రైమ్ కో ఆర్డినేషన్ సెంటర్ ఆధ్వర్యంలో జిల్లాలోని సైబర్ వారియర్స్, స్టేషన్ హౌస్ ఆఫీసర్లకు గ్రీవెన్స్ రెడ్రెస్సల్ మాడ్యూల్ (GRM), మనీ రెస్టోరేషన్ మాడ్యూల్ (MRM)ల వినియోగంపై ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.
ఈ శిక్షణలో అధికారులు మాట్లాడుతూ.. సైబర్ నేరాలతో ఎలాంటి సంబంధం లేకపోయినా దర్యాప్తు ప్రక్రియలో భాగంగా పొరపాటున బ్యాంకు ఖాతాలు లేదా నగదు ఫ్రీజ్ అయిన సాధారణ పౌరులు జీఆర్ఎం (GRM) ద్వారా తమ వినతులను సంబంధిత బ్యాంకులకు సమర్పించుకోవచ్చని తెలిపారు. అధికారులు ఆ వినతులను పరిశీలించి, నిబంధనల మేరకు అర్హులైన వారి బ్యాంకు ఖాతాలను తక్షణమే డీ-ఫ్రీజ్ చేయడం లేదా ఫ్రీజ్ అయిన నగదును విడుదల చేసే చర్యలు చేపడతారని వివరించారు. అదేవిధంగా సైబర్ మోసాలకు గురైన బాధితులకు వారు కోల్పోయిన నగదును వేగంగా రికవరీ చేసేందుకు ‘ఎంఆర్ఎం’ ఎంతగానో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ రోహిత్ రాజు (SP Rohith Raju) మాట్లాడుతూ.. జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల సైబర్ వారియర్స్ ఈ జీఆర్ఎం, ఎంఆర్ఎం మాడ్యూళ్లను సమర్థవంతంగా వినియోగించి ప్రజల వినతులను సత్వరమే పరిష్కరించాలని ఆదేశించారు. బ్యాంకులు, దర్యాప్తు అధికారులతో నిరంతరం సమన్వయం పెంచుకుంటూ సైబర్ నేరాల బాధితులకు వేగంగా న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ శిక్షణ కార్యక్రమంలో సైబర్ సెల్ సీఐ జితేందర్, పలువురు పోలీసు అధికారులు, సైబర్ వారియర్స్, సిబ్బంది పాల్గొన్నారు.
Read Also: కాళేశ్వరం ఒక మాయ.. హరీశ్‌పై వేముల వీరేశం ఫైర్
Follow Us On: X(Twitter)

