కలం, నాగర్ కర్నూల్: ఆర్టీసీని నష్టాల నుంచి లాభాల బాట పట్టించిన ఘనత ప్రజా ప్రభుత్వానిదేనని మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) అన్నారు. మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలిసి బుధవారం నాగర్ కర్నూల్ లో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పొన్నం మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ దేశంలోనే అత్యుత్తమ ప్రజా రవాణా సంస్థగా ఎదుగుతోందని, ఒకప్పుడు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్న ఆర్టీసీ నేడు ప్రజల విశ్వాసాన్ని చూరగొంటూ లాభాల బాటలో పరుగులు పెడుతోందని మంత్రి చెప్పారు.
రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం 10,170 బస్సులు, 97 డిపోలు, 364 బస్టాండ్లు, సుమారు 55 వేల మంది ఉద్యోగులతో తెలంగాణ ఆర్టీసీ ప్రతిరోజూ 65 లక్షల మంది ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు సురక్షితంగా చేర్చుతోందన్నారు. ప్రజా రవాణాలో తెలంగాణ ఆర్టీసీ దేశంలోనే ఆదర్శంగా నిలుస్తోందని, ప్రజలకు నాణ్యమైన సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి (Ponnam Prabhakar) స్పష్టం చేశారు. మహిళల కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణ పథకం చారిత్రాత్మక విజయాన్ని సాధించిందన్నారు.
మహిళా లక్ష్మీ పథకం ద్వారా ఇప్పటి వరకు 326 కోట్లకు పైగా మహిళా ఉచిత ప్రయాణాలు నమోదయ్యాయని, ఈ పథకం ద్వారా మహిళలు రూ.11,377 కోట్ల మేర ప్రయాణ వ్యయాన్ని ఆదా చేసుకున్నారని వివరించారు. మహిళలను బస్సుల యజమానులుగా భావిస్తూ వారికి ఆర్థిక భరోసా కల్పించిన ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వమేనని చెప్పారు. ప్రజా ప్రభుత్వం ఆధ్వర్యంలో ఆర్టీసీ కార్మికుల డిమాండ్లు వచ్చిన తర్వాత మూడు రోజుల్లోనే ఆర్టీసీ కార్మికుల ప్రధాన డిమాండ్లను పరిష్కరించడంతో పాటు వివిధ కారణాలతో ఉద్యోగాలకు దూరమైన 355 మంది ఉద్యోగులకు తిరిగి నియామక పత్రాలు అందించిందని గుర్తు చేశారు.
రాష్ట్రంలో ప్రస్తుతం ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమం కొనసాగుతోందని, అర్హులైన ప్రతి ఒక్కరూ బీఎల్‌వోలు అందించే ఎన్యూమరేషన్ ఫారాలను పూర్తిగా నింపి, అవసరమైన ఫొటోలు సమర్పించి తమ ఓటు హక్కును పరిరక్షించుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత విలువైనదని, ప్రతి పౌరుడు తన ఓటును జాబితాలో కొనసాగించే బాధ్యత తీసుకోవాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక ఒత్తిళ్లు ఉన్నప్పటికీ సంక్షేమ కార్యక్రమాల అమలులో ఎలాంటి రాజీ పడటం లేదని మంత్రి స్పష్టం చేశారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా ఇల్లు లేని ప్రతి అర్హ కుటుంబానికి పక్కా ఇల్లు అందిస్తామని తెలిపారు. గత ప్రభుత్వం డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పేరుతో ప్రజలను ఆశపెట్టి నిరాశపరిచిందని తెలిపారు.
మహిళల జీవితాల్లో గొప్ప మార్పు : జూపల్లి
మహాలక్ష్మి పథకం మహిళల జీవితాల్లో గొప్ప మార్పు తీసుకువచ్చిందని మంత్రి జూపల్లి తెలిపారు. ప్రతిరోజూ లక్షలాది మంది మహిళలు ఉచితంగా ప్రయాణిస్తూ కుటుంబ ఆర్థిక భారం తగ్గించుకుంటున్నారని చెప్పారు. గత ప్రభుత్వంలో ఆర్టీసీని ప్రైవేటీకరణ దిశగా నడిపించే ప్రయత్నాలు జరిగాయని, ప్రస్తుతం ప్రజా ప్రభుత్వం సంస్థను మరింత బలోపేతం చేస్తోందన్నారు. గత ప్రభుత్వం చేసిన అప్పులకు భారీగా వడ్డీలు చెల్లిస్తూనే ప్రస్తుత ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లు, కొత్త రేషన్ కార్డులు, సన్నబియ్యం పంపిణీ, సన్న వడ్లకు రూ.500 బోనస్, రైతు సంక్షేమం, మహిళా సంక్షేమం వంటి అనేక ప్రజా సంక్షేమ కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేస్తోందని వివరించారు.
సభ అనంతరం మంత్రులు నాగర్ కర్నూల్ నుండి వయా తూడుకుర్తి నుండి వనపర్తి కి ప్రయాణించే బస్సును రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యే ఎమ్మెల్సీ కలెక్టర్, జెండా ఊపి ప్రారంభించి బస్సులో ప్రయాణించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు దేవ సహాయం, అరుణా రెడ్డి నాగర్ కర్నూల్ మున్సిపల్ చైర్మన్ తీగల సునేంద్ర, జిల్లా మార్కెట్ కమిటీ చైర్మన్ రమణారావు, గ్రంథాలయ చైర్మన్ రాజేందర్, వైస్ చైర్మన్ బాదం రమేష్, కౌన్సిలర్లు, జిల్లా ప్రజాప్రతినిధులు, అధికారులు, ఆర్టీసీ ఉన్నతాధికారులు, ప్రజా ప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, నాయకులు, మహిళలు, భారీ సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.

