Mobile Popup Ad
Mobile Popup Ad

గుడ్ న్యూస్‌.. ఇక మీసేవ‌లోనూ యూరియా బుకింగ్‌!

క‌లం, వెబ్ డెస్క్‌: రైతులకు యూరియా పంపిణీని మరింత సులభతరం చేయడానికి తెలంగాణ ప్రభుత్వం (Telangana Govt) కీల‌క‌ చర్యలు తీసుకుంది. మీసేవ కేంద్రాల ద్వారా కూడా యూరియా బుకింగ్‌(Urea Booking) కు అవకాశం కల్పించింది. అన్ని మీ సేవ కేంద్రాల్లో యూరియా బుకింగ్ విధానం అందుబాటులోకి వచ్చిన‌ట్లు తెలిపింది. స్మార్ట్‌ఫోన్ లేని రైతులు, స్వయంగా ఆన్‌లైన్‌లో బుకింగ్ చేసుకోలేని రైతులు తమ సమీపంలోని మీసేవ కేంద్రాన్ని సందర్శించి యూరియాను సులభంగా బుక్ చేసుకోవచ్చు. యూరియా బ‌స్తాకు మీసేవ రుసుమును రూ.10గా ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. రైతులు ఓటీపీతో వెంట‌నే మీసేవ‌లో యూరిగా బుక్ చేసుకోవ‌చ్చ‌ని వెల్లడించింది. ఈ ఓటీపీ 48 గంట‌ల పాటు చెల్లుబాటు అవుతుంద‌ని తెలిపింది. ఎంపిక చేసిన డీల‌ర్ల వ‌ద్ద‌నే యూరియా కొనుగోలు చేయాల‌ని సూచించింది.

ఎలా బుక్ చేసుకోవాలంటే..

రైతులు త‌మ పట్టాదారు పాస్‌బుక్ నెంబ‌ర్‌తో సమీపంలోని మీ సేవ కేంద్రాన్ని సందర్శించాలి. మీ సేవ ఆపరేటర్ రైతు వివరాలను సేకరించి, సాగు విస్తీర్ణం, పంట వివరాలను నమోదు చేస్తారు. రైతు ఎంపిక చేసిన ఎరువుల డీలర్ వద్ద అవసరమైన యూరియా పరిమాణాన్ని బుక్ చేస్తారు. రైతు ఇచ్చిన‌ మొబైల్ నంబర్‌కు పంపిన ఓటీపీని క‌న్‌ఫ‌ర్మ్ చేసిన తర్వాత వెంటనే బుకింగ్ ఐడీ జారీ అవుతుంది. ఈ బుకింగ్ ఐడీ బుకింగ్ చేసిన తేదీని మినహాయించి 48 గంటలపాటు మాత్రమే చెల్లుబాటు అవుతుంది. బుకింగ్ గడువు ముగిసేలోపు రైతులు ఎంపిక చేసిన ఎరువుల డీలర్‌ను సంప్రదించి యూరియాను కొనుగోలు చేయాలి.

సబ్సిడీ యూరియా బుకింగ్‌ను అధికారిక ఫర్టిలైజర్ బుకింగ్ యాప్ లేదా మీ సేవ కేంద్రాల ద్వారానే చేయాలని వ్యవసాయశాఖ సూచించింది. ఓటీపీని పొంద‌డానికి రైతులు తమ పట్టాదారు పాస్ బుక్‌తో అనుసంధానమైన మొబైల్ నంబర్ యాక్టివ్‌లో ఉండేలా చూసుకోవాలి. కేవలం పదిరూపాయల నామమాత్రపు సేవా రుసుముతో మీసేవ ద్వారా రైతులు అందరూ ఈ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చు. ఏవైనా సందేహాలుంటే సమీప వ్యవసాయ విస్తరణ అధికారి, మండల వ్యవసాయ అధికారి లేదా సమీప మీసేవ కేంద్రాన్ని సంప్రదించవచ్చు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>