Mobile Popup Ad
Mobile Popup Ad

వెర్‌స్టాపెన్ ప్రమోషన్‌కు హార్నర్ నో..? మార్కో షాకింగ్ కామెంట్స్

కలం, స్పోర్ట్స్: ఫార్ములా వన్ ప్రపంచంలో మ్యాక్స్ వెర్‌స్టాపెన్ గురించి మరో ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. 2016లో అతడిని రెడ్‌బుల్ రేసింగ్ ప్రధాన జట్టులోకి తీసుకురావడాన్ని అప్పటి టీమ్ బాస్ క్రిస్టియన్ హార్నర్ వ్యతిరేకించారని మాజీ సలహాదారు హెల్ముట్ మార్కో (Helmut Marko) వెల్లడించాడు. మే 15తో వెర్‌స్టాపెన్ రెడ్‌బుల్ తరఫున తొలి రేసు ఆడి పదేళ్లు పూర్తయ్యాయి. 2016 స్పానిష్ గ్రాండ్ ప్రిక్స్‌లో కేవలం 18 ఏళ్ల వయసులోనే అతడు అరంగేట్రం చేశాడు. అదే రేసులో విజయం సాధించి ఎఫ్1 చరిత్రలోనే అత్యంత పిన్న వయసులో రేస్ గెలిచిన డ్రైవర్‌గా నిలిచాడు.

అయితే ఆ సమయంలో అతడిని ప్రధాన జట్టులోకి తీసుకురావడంపై పెద్ద చర్చ జరిగిందని మార్కో వెల్లడించాడు. డానియిల్ క్వియాట్ స్థానంలో కేవలం నాలుగు రేసుల తర్వాత వెర్‌స్టాపెన్‌ను తీసుకురావడం సరైన నిర్ణయం కాదని హార్నర్ (Christian Horner) భావించాడని చెప్పారు. చాలామంది విమర్శకులు కూడా వెర్‌స్టాపెన్ చాలా చిన్నవాడని, ఇది ప్రమాదకర నిర్ణయమని వ్యాఖ్యానించారని మార్కో గుర్తు చేశాడు. అయినా రెడ్‌బుల్ మేనేజ్‌మెంట్ మాత్రం వెర్‌స్టాపెన్‌పైనే నమ్మకం పెట్టుకుంది.

మరోవైపు కార్లోస్ సైన్జ్ కూడా ఆ అవకాశం తనకు రాకపోవడంతో నిరాశ చెందినట్లు మార్కో తెలిపాడు. 2016 సీజన్‌లో క్వియాట్ ఆశించిన స్థాయిలో రాణించకపోవడంతోనే మార్పు చేయాల్సి వచ్చిందని మార్కో వివరించాడు. 2015లో అతడి ప్రదర్శన బాగానే ఉన్నా.. తర్వాత కారుతో అతడు సౌకర్యంగా లేకపోయాడని, వరుస తప్పిదాలు, ప్రమాదాలు జట్టును ఆలోచనలో పడేశాయని పేర్కొన్నాడు. వెర్‌స్టాపెన్‌కు అవకాశం ఇచ్చిన వెంటనే ఫలితం కనిపించింది.

స్పానిష్ గ్రాండ్ ప్రిక్స్‌లోనే అతడు విజయం సాధించి విమర్శకుల నోళ్లు మూయించాడు. ఆ గెలుపు తనకూ, రెడ్‌బుల్ యజమాని డీట్రిచ్ మాటెషిట్జ్‌కూ భారీ ఊరటనిచ్చిందని మార్కో చెప్పాడు. అంతేకాదు, అప్పటికే వెర్‌స్టాపెన్ మానసికంగా చాలా పరిపక్వంగా ఉన్నాడని మార్కో అభిప్రాయపడ్డాడు. ఆ రేసులో ఫెరారీ స్టార్ కిమి రైకొనెన్ ఒత్తిడిని తట్టుకుని తెలివిగా డ్రైవ్ చేశాడని గుర్తు చేశాడు. గత పదేళ్లలో వెర్‌స్టాపెన్ రెడ్‌బుల్‌తో కలిసి 71 రేస్ విజయాలు, 48 పోల్స్ సాధించాడు. అలాగే నాలుగు ప్రపంచ ఛాంపియన్‌షిప్ టైటిళ్లు గెలిచి ఎఫ్1లో అగ్రస్థానానికి చేరాడు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>