కలం, ఖమ్మం బ్యూరో : మున్సిపల్ ఎన్నికల (Municipal Elections) నేపథ్యంలో వలసల పర్వం కొనసాగుతోంది. ఉమ్మడి జిల్లాలో వలసలు భారీగా కొనసాగుతున్నాయి. టికెట్ ఆశించి బంగపడి కొందరు వలస వెళ్తే, టికెట్ వస్తుందనే ఆశతో కొందరు వలస వెళ్లిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే అభ్యర్ధులను డిక్లేర్ చేసిన తర్వాత కూడా వలసలు కొనసాగుతున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోనీ కొత్తగూడెం కార్పొరేషన్ (Kothagudem Corporation) 34వ డివిజన్ కు చెందిన 50 కుటుంబాలు.. ఎమ్మెల్యే కునంనేని సాంబశివరావు సమక్షంలో సీపీఐలో చేరాయి. బుధవారం కొత్తగూడెంలోని 29 వ డివిజన్ న్యూ గొల్లగూడెంకు చెందిన పలువురు సీపీఐ కార్యకర్తలు రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర సమక్షంలో గులాబీ కండువా కప్పుకున్నారు.
మరో పక్క లోక్‌సభ ఎంపీ రామ సహాయం రఘురామరెడ్డి (MP Raghuram Reddy) సమక్షంలో పలువురు హస్తం గూటికి చేరారు. అంతేకాకుండా ఖమ్మం జిల్లా ఎదులాపురం 27వ వార్డులో ఉంటున్న సీపీఐ సీనియర్ నాయకుడు గణపు వీరయ్యతో పాటు పలువురు సీపీఐ కార్యకర్తలు మంత్రి పొంగులేటి సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. మున్సిపల్ ఎన్నికల పోలింగ్ తేదీ సమీపిస్తున్న వేళ ప్రధాన రాజకీయ పార్టీల నేతలు చేరికలపై ఫోకస్ పెట్టీ, కొంచెం పేరున్న వారిని కూడా తమ వైపు లాక్కునే ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో సాధారణ కార్యకర్త నుంచి కీలక నేత వరకూ కండువాలు మారుస్తున్న పరిస్థితి నెలకొంది. ఎన్నికల (Municipal Elections) గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రధాన పార్టీలన్నీ వీలైనంత మేర ఆకర్షణ మంత్రం పఠిస్తున్నాయి.
ఉన్నవాళ్ళను కాపాడుకోవడం, ఇతర పార్టీల వారికి గాలం వేయడం, వదిలి వెళ్లిన వారిని మళ్ళీ సొంత గూటికి తెచ్చుకోవడం లక్ష్యంగా వ్యూహాలు అమలు చేస్తున్నాయి. ఈ వ్యవహారంలో జిల్లాలో ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్, సీపీఐ దూకుడుగా వ్యవహరిస్తున్నాయి. ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రి తో పాటు సీనియర్ నాయకులందరూ పార్టీలకు అతీతంగా చేరికలను ప్రోత్సహిస్తున్న సిచ్యుయేషన్ జిల్లాలో కనిపిస్తుండటం గమనార్హం. అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల లాగానే స్థానిక సంస్థల ఎన్నికలలో కూడా వలసలు విపరీతంగా కొనసాగుతుండటంతో పట్టణాల్లో వివిధ పార్టీల నాయకులు అటూ ఇటూ జంపింగ్ చేస్తూ తమ స్వలాభం కోసం ప్రయత్నాలు చేస్తున్నారనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. ఈ విధంగా కండువాలు మార్చే నాయకులు చెప్పిన మాటలు, చేసే ప్రచారాలు ఓటర్లు విశ్వసిస్తారో లేదా కర్రు కాల్చి వాత పెట్టినట్లు తగిన గుణపాఠం చెప్తారో ఈ నెల 11వరకూ వేచి చూడాల్సిందే..
Read Also: ఉగాదికి గద్దర్ అవార్డులు.. టాలీవుడ్ పెద్దలకు భట్టి కీలక సూచనలు
Follow Us On: Pinterest


