కలం మెదక్ బ్యూరో: ఇటీవల కాలంలో దొంగలు రెచ్చిపోతున్నారు. తాళం వేసిన ఇళ్లు లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలో మెదక్ (Medak) జిల్లా పెద్దశంకరంపేట మండలం చీలపల్లి (Cheelpalle) గ్రామంలో దొంగలు బీభత్సం సృష్టించారు. గురువారం రాత్రి గ్రామంలోని పలు ఇళ్లలో చోరీలకు పాల్పడ్డారు. తాళం వేసిన ఇళ్లే లక్ష్యంగా దొరికింది దోచుకున్నారు.
గ్రామానికి చెందిన రాములు కుటుంబం పెళ్లికి వెళ్లగా.. గమనించిన దుండగులు ఇంట్లో ఎవరు లేని సమయంలో బీరువా పగులగొట్టి సుమారు 100 తులాల బంగారం ఎత్తుకెల్లారు. ఏసిరెడ్డి మాణికరెడ్డి ఇంట్లో 2 తులాల బంగారం, జెగ్గు చిన్న మల్లారెడ్డి ఇంట్లో రెండున్నర తులాల బంగారం, జగ్గు అరుంధ ఇంట్లో కమ్మలు, పట్టగొలుసులు ఎత్తుకువెళ్లారు. బాధితుల సమాచారం మేరకు అల్లదుర్గం సీఐ రేణుకరెడ్డి, ఎస్ఐ ప్రవీణ్ రెడ్డి గ్రామంలో విచారణ చేపట్టారు. క్లూస్ టీమ్ ద్వారా గ్రామంలో దర్యాప్తు చేపట్టారు. కుటుంబంతో కలిసి ఎక్కువ రోజులు ఊరికి వెళ్లేటప్పుడు స్థానిక పోలీస్ స్టేషన్‌లో సమాచారం ఇవ్వాలని పోలీసులు సూచిస్తున్నారు.

