కలం, నల్లగొండ: నల్లగొండ పట్టణంలో శాంతిభద్రతల పరిరక్షణే ధ్యేయంగా పోలీసులు జిల్లా (Nalgonda Police) ఈరోజు తెల్లవారుజాము నుంచే భారీ కార్డెన్ అండ్ సెర్చ్ (విస్తృత తనిఖీలు) నిర్వహించారు. జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆదేశాల మేరకు ఈ ఆపరేషన్ చేపట్టారు. పట్టణాన్ని ఒక్కసారిగా తమ ఆధీనంలోకి తీసుకున్న పోలీసులు అనుమానాస్పద ప్రాంతాలపై జల్లెడ పట్టారు. ఈ విస్తృత తనిఖీల్లో సుమారు 200 మంది పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. పట్టణంలోని పలు కాలనీలు, అనుమానిత ప్రాంతాలు, లాడ్జీలు, అద్దె గదులను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. బస్టాండ్, రైల్వే స్టేషన్, నగరంలోని ప్రధాన కూడళ్ల వద్ద పోలీసులు గట్టి నిఘా ఏర్పాటు చేశారు. ప్రయాణికులను, వారి బ్యాగులను నిశితంగా పరిశీలించారు. సరైన పత్రాలు, రిజిస్ట్రేషన్ లేని పలు వాహనాలను పోలీసులు గుర్తించి, స్వాధీనం చేసుకున్నారు.
తనిఖీల సమయంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న పలువురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని, వారి పూర్తి వివరాలను సేకరించి పరిశీలిస్తున్నారు. ఈ సెర్చ్ ఆపరేషన్ సందర్భంగా నేరచరిత్ర కలిగిన వ్యక్తులు, రౌడీషీటర్ల కదలికలపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. పట్టణంలో శాంతిభద్రతలకు భంగం కలిగించాలని చూసే వారిపై, చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తప్పవని ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ హెచ్చరించారు. పట్టణంలో ఎక్కడైనా అనుమానాస్పద వ్యక్తులు గానీ, వస్తువులు గానీ కనిపిస్తే ఆలస్యం చేయకుండా వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించాలని ప్రజలకు సూచించారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు అత్యంత రహస్యంగా ఉంచుతామని పోలీసులు తెలిపారు.

