కలం, వెబ్ డెస్క్ : అనంతపురం (Anantapur) జిల్లా గుత్తి మండలం వన్నేదొడ్డి సమీపంలో 44వ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుండి అనంతపురం వెళ్తున్న కేకే ట్రావెల్స్ ప్రైవేట్ బస్సు ఒక్కసారిగా టైరు పగిలిపోవడంతో అదుపుతప్పింది. వేగంగా రోడ్డు పక్కకు దూసుకెళ్లి బోల్తా పడింది.
ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 24 మంది ప్రయాణికులు ఉన్నారు. వారిలో సుమారు 13 మందికి గాయాలయ్యాయి. మిగిలిన వారు ఎటువంటి గాయాలు లేకుండా సురక్షితంగా బయటపడటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. స్థానికుల సహాయంతో క్షతగాత్రులను చికిత్స నిమిత్తం తక్షణమే ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు.

