కలం, వెబ్ డెస్క్: “తల్లిదండ్రుల్ని కాదని ప్రేమ పెళ్లి చేసుకొని తప్పు చేశాను.. జీవితంలో పడాల్సిన కష్టాలన్నీ పడ్డాను. నా కడుపున పుట్టిన పాపానికి నా బిడ్డలు కూడా అనుభవించారు.. ఇక ఈ లోకంలో బతకలేను..” అంటూ ఓ వివాహిత లేఖ రాసి బలవన్మరణానికి(Suicide) పాల్పడింది. తనతో పాటు తన ఇద్దరు కూతుళ్లను కూడా ఈ ప్రపంచానికి దూరం చేసింది. ఈ విషాదకర ఘటన తిరుపతి(Tirupati) జిల్లాలోని పుత్తూరు(Puttur)లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. పద్మ అనే మహిళ తన ఇద్దరు కూతుళ్లకు ఉరి వేసి ఆత్మహత్య చేసుకుంది. ప్రేమ వివాహం చేసుకున్న భర్త కుటుంబాన్ని పట్టించుకోకుండా అప్పులు చేయడంతో ఈ దారుణానికి పాల్పడింది. ఆత్మహత్యకు ముందు పద్మ రాసిన సూసైడ్ నోట్ అందరినీ కన్నీళ్లు పెట్టిస్తోంది. ప్రేమ పెళ్లి చేసుకొని ఎంతో వేదన అనుభవించానని, తన తల్లిదండ్రులు, అన్నకు క్షమాపణలు చెప్పిన తీరు ప్రతి ఒక్కరినీ ఆలోచనలో పడేస్తోంది.
పద్మ రాసిన లేఖలో ఏముందంటే..
పద్మ రాసిన ఆత్మహత్య లేఖ(Suicide Note) చూస్తే తాను ఎన్ని కష్టాలు అనుభవించిందో అర్థమవుతోంది. తన ఎనిమిదేళ్ల ప్రేమ పెళ్లి జీవితంలో అన్నను, తల్లిదండ్రులను ఎంతగా తలచుకొని ఉంటుందో ఊహించవచ్చు. చివరికి పిల్లల్ని కూడా చంపేసేంత కఠిన నిర్ణయం తీసుకుందంటే ఆమె ఎన్నాళ్లుగా ఈ కష్టాన్ని తన కడుపులో దాచుకుందోనని అందరూ చర్చించుకుంటున్నారు. ఇంతకీ పద్మ లేఖలో ఏం రాసిందంటే..
“తల్లీదండ్రులను కాదని పెళ్లి చేసుకును ప్రతి ఒక్కరికి నా జీవితం ఒక గుణపాఠం.. ఒక అమ్మాయి ఎటువంటి లక్షణాలు తన భర్తకు ఉండకూడదు అనుకుంటుందో అలాంటివన్నీ నా భర్తకు ఉన్నాయని నేను కలలో కూడా అనుకోలేదు. శివ శంకర్‌ను పెళ్లి చేసుకున్న పాపానికి నేను పడాల్సిన కష్టాలన్నీ అనుభవించాను. నా కడుపులో పుట్టిన పాపానికి నా పిల్లలు కూడా అనుభవిస్తున్నారు. ఏంటి? నేను ఎప్పుడూ.. డబ్బు, డబ్బు అంటానా.. కనీసం ఇంటి ఖర్చులకు కూడా డబ్బులు అడగని అమ్మాయి ఉంటే హ్యాపీగా పెళ్లి చేసుకో.. నాకు నిన్ను భరించే ఓపిక ఇంక లేదు.. ఊరంతా అప్పులు.. లోన్లు చేసేసి నా దగ్గర డబ్బు లేదు, నేను తీర్చలేను అంటే నేనేమి చేయాలి? నువ్వు పనికి వెళ్లకపోయినా, ఎవరితో తిరిగినా అడగడానికి నీకు భార్య లేదు.. ఇంక హ్యాపీగా ఉండు.. నన్ను చేసుకొని నువ్వు కష్టపడుతున్నావా? ఇక నేను లేను… హ్యపీగా బతుకు. భార్య, పిల్లల్ని పోషించలేదని వాడివి ఎందుకు పెళ్లి చేసుకోవాలి? ఎలాగూ ఇంకో పెళ్లి చేసుకుంటావు… అదైనా లైఫ్‌లో సెటిల్ అయ్యాక చేసుకో.. నాలాగా ఇంకొక అమ్మాయి జీవితాన్ని నాశనం చెయ్యకు.. ఇంకొక జన్మలో తల్లిదండ్రులు చూసిన సంబంధం చేసుకొని పుట్టింటి వాళ్లతో జీవితాంతం కలిసి ఉండాలని ఆ దేవుడ్ని కోరుకుంటాను.. అన్న నన్ను క్షమించు.. ఇప్పటి వరకు.. నీతో మాట్లాడలేదంటే నీ మీద ప్రేమ లేదని కాదు.. నిన్ను ఫేస్ చేసే ధైర్యం లేదు.. నువ్వు అడిగే ఏ ఒక్క ప్రశ్నకు నా దగ్గర సమాధానం లేదు. 8 సంవత్సరాలు అవుతోంది నీ నోటి నుంచి పాపా అని విని.. చివరి సారిగా నన్ను, నా పిల్లల్ని వచ్చి చూడు.. ఇంక చూడాలనుకున్నా మేం ఉండము.. నీ నోటితో పాప అని ఒక్కసారి పిలువు చాలు అన్న.. సారీ నాన్న నన్ను కమించండి..” అని పద్మ తన లేఖలో పేర్కొంది. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.


