కలం/ఖమ్మం బ్యూరో: మావోయిస్టు పార్టీకి ద్రోహం చేసి హిడ్మాను చంపించిన కాంగ్రెస్ నేతను వదిలేది లేదంటూ ఆ పార్టీ హెచ్చరించడంతో (Maoist Threat) పోలీసు భద్రత కోసం కాంగ్రెస్ నాయకుడు దుర్గా ప్రసాద్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. మావోయిస్టు పార్టీ పేరుతో వచ్చిన హెచ్చరిక లేఖ అనంతరం ఆయన స్పందించారు. ఈ లేఖ ఒరిజినలా?.. లేక ఆ పేరుతో ఎవరైనా పనిగట్టుకుని సృష్టించిందా?.. అనేది తనకు తెలియదని, కానీ ఆ లేఖలో తన పేరు ప్రస్తావించడంతో పోలీసులను ఆశ్రయించినట్లు తెలిపారు. ఈ లేఖ గురించి పోలీసులకు వివరించి తనకు, తన కుటుంబానికి ప్రాణహాని ఉన్నందున సెక్యూరిటీ ఇవ్వాల్సిందిగా కోరినట్లు తెలిపారు. లేఖ వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ నేతలుగానీ, రాష్ట్ర ప్రభుత్వంగానీ తనతో ఏమీ చర్చించలేదన్నారు. స్థానిక పోలీసులు తన ఇంటికి వచ్చి లెటర్ గురించి వాకబు చేసి వెళ్లారని తెలిపారు.
హిడ్మాతో నాకు సంబంధం లేదు : దుర్గాప్రసాద్
మావోయిస్టు పార్టీ నాయకుడు హిడ్మాతో తనకు ఎలాంటి సంబంధమూ లేదని, ఇప్పటివరకు ఆయనను చూడనేలేదని నల్లపు దుర్గాప్రసాద్ వివరించారు. ఆయనను తానే పోలీసులకు పట్టించి ఎన్‌కౌంటర్ పేరుతో చంపేయించినట్లు వికల్ప్ పేరుతో మావోయిస్టు పార్టీ నుంచి వచ్చిన లేఖలోని ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదన్నారు. హిడ్మా మాట్లాడే భాష తనకు రాదని, తాను మాట్లాడేది హిడ్మాకు తెలియకపోవచ్చన్నారు. హిడ్మా ఫోటోను ఫస్ట్ టైమ్ మీడియాలోనే చూసాను తప్ప తనకు ఎలాంటి పరిచయమూ లేదన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆయనను పోలీసులకు తానే పట్టించినట్లు మావోయిస్టు పార్టీ ఆరోపించడం వాస్తవ విరుద్ధమైనదన్నారు. విద్యార్ధి దశలో ఎన్‌ఎస్‌యూఐలో చేరినప్పటి నుంచి రాజకీయాల్లో ఉన్నానని, దీర్ఘకాలంగా కాంగ్రెస్ లీడర్‌గా ఉన్నానని దుర్గాప్రసాద్ గుర్తుచేశారు. జిల్లాలో తన ఎదుగుదలను చూసి గిట్టనివారు కొందరు పనిగట్టుకుని ఇలాంటి దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.
భయపడిపోయి చర్లను విడిచిపెట్టను :
మావోయిస్టు పార్టీ రాసిన లేఖలో తనను హెచ్చరించడం విస్మయానికి గురిచేసిందని, కానీ భయపడిపోయి సొంత గ్రామం నుంచి పారిపోవాలనే ఉద్దేశమే లేదని దుర్గాప్రసాద్ వివరణ ఇచ్చారు. చుట్టూ అటవీ ప్రాంతం ఉండడంతో ఎప్పుడు ఎటువైపు నుంచి మావోయిస్టులో వస్తారోననే ఆందోళన (Maoist Threat) ఉన్నదన్నారు. చత్తీస్‌గఢ్ సరిహద్దుకు కేవలం 10 కి.మీ. దూరంలోనే తన గ్రామం ఉంటుందని గుర్తుచేశారు. చర్ల మండలంలో ప్రతీ ఊరికి ఒకటి చొప్పున పోలీసు క్యాంపులు ఉన్నాయని, నిజంగా మావోయిస్టు పార్టీ ఆరోపించినట్లు హిడ్మాతో తనకు సంబంధం ఉంటే అది పోలీసులకు తెలియకుండా ఉంటుందా అని ఎదురు ప్రశ్నించారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న టెక్నాలజీతో కోవర్టులను గుర్తించడం కష్టమేమీ కాదన్నారు. ఉద్దేశపూర్వకంగా తన మీద బురద చల్లే ప్రయత్నం చేస్తున్నవారెవరో తనకు తెలియదన్నారు.
ఆ లేఖ దిగ్భ్రాంతి కలిగించింది :
మావోయిస్టు పార్టీ లేఖ తనకు దిగ్భ్రాంతి కలిగించిందని, ఇంకా ఆ షాక్ నుంచి తేరుకోలేదన్నారు. చర్ల గ్రామం తన నేటివ్ ప్లేస్ అయినప్పటికీ ఈ లేఖ తర్వాత బయటికి రాలేకపోతున్నానని వ్యాఖ్యానించారు. సొంత గ్రామం కావడంతో తనకు ఇక్కడే సేఫ్టీ ఉంటుందని, ఎటో వెళ్ళిపోయి బతకాలనే ఆలోచనే లేదని, ఇక్కడి ప్రజలంతా తన స్వంత మనుషులని, వారే తనను కాపాడుకుంటారని ధీమా వ్యక్తం చేశారు. పార్టీని మోసం చేసిన కారణంగా ఒక కాంట్రాక్టరును ప్రజాకోర్టులో హతమార్చాం అంటూ గుర్తుచేసిన అల్లూరి డివిజన్ కమిటీ నేత విప్లవ్.. ఆ లేఖలో నల్లపు దుర్గా ప్రసాద్ అంటూ తన పేరును ప్రత్యేకంగా రాయడం ఆందోళన కలిగించిందన్నారు. ఈ లేఖ వెలుగులోకి రావడంతోనే అభిమానులు, స్థానిక ప్రజలు తనను పరామర్శించడానికి వచ్చారని, వారి సూచనలతోనే ఇంటిని వదిలి బైటకు రావడంలేదన్నారు.
పొలిటీషియన్లు, కాంట్రాక్టర్లలో భయం :
మావోయిస్టు హిట్ లిస్టులో ఉన్న రాజకీయ నాయకులకు, కాంట్రాక్టర్లకు తాజా లేఖతో భయం పట్టుకున్నది. ప్రజా కోర్టులో శిక్ష తప్పదంటూ పార్టీ హెచ్చరించడమే దానికి కారణం. కొత్తగూడెం జిల్లాతో పాటు భద్రాచలం పరిసర ప్రాంతాల్లోని రాజకీయ నాయకులు, కాంట్రాక్టర్లు భయభ్రాంతులకు గురవుతున్నారు. రానున్న రోజుల్లో ఇంకా ఎవరెవరి పేర్లు వెలుగులోకి వస్తాయోననే ఆందోలన, అనుమానం నెలకొన్నది. పోలీసు భద్రత కల్పించాల్సిందిగా దుర్గాప్రసాద్ రిక్వెస్టుపై ప్రభుత్వం నుంచి స్పందన రాకపోయినా స్థానిక పోలీసులు ఆయనను కలిసి వివరాలను సేకరించారు.
Read Also: అసెంబ్లీలో ‘జల’ చర్చ.. గాఢ నిద్రలో ఎమ్మెల్యేలు (వీడియో)
Follow Us On: Youtube


