కలం, నల్లగొండ బ్యూరో : పోరాటాల ఖిల్లా నల్లగొండ జిల్లా. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటమైనా.. మావోయిస్టు ఉద్యమమైనా (Maoist Movement ).. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన యుద్దమైనా.. ఉమ్మడి నల్లగొండ జిల్లాదే కీ రోల్. మావోయిస్టు ఉద్యమం మూడు దశాబ్దాల పాటు ఉమ్మడి జిల్లాలో కొనసాగుతూ వస్తోంది. ప్రధానంగా 1990 నుంచి 2005 మధ్య కాలంలో మావోయిస్టు ఉద్యమం ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పతాకస్థాయిలో నడిచింది. ఉమ్మడి జిల్లా నుంచి మావోయిస్టు ఉద్యమంలో కీ రోల్ పోషించిన పోరాట బిడ్డలెందరో. కేంద్ర కమిటీలోనూ సుదీర్ఘకాలం పాటు కీలకంగా వ్యవహరించారు. రాచకొండ దళం, కనగల్ దళం, ఆలేరు, కృష్ణపట్టే ఏరియా దళాల పేరుతో ఉద్యమం ఉర్రూతలూగింది.
ఒక్క మాటలో చెప్పాలంటే.. మావోయిస్టుల కనుసన్నల్లోనే 15 ఏండ్లకు పైగా జిల్లా నడిచింది. కానీ కాలం మారింది. పరిస్థితులు మారాయి. ఫలితంగా మావోయిస్టు ఉద్యమ ప్రభావం ఉమ్మడి నల్లగొండ జిల్లాలో తగ్గిపోయింది. మావోయిస్టు ఉద్యమానికి సంబంధించి ఉమ్మడి జిల్లా పరిధిలోనే ఆయా ఎన్‌కౌంటర్లలో దాదాపు 200 మందికి పైగా ప్రాణాలు వదలగా, ఉమ్మడి జిల్లాకు చెందిన 20 మందికి పైగా మావోయిస్టులు అమరులయ్యారు. నిజానికి ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మావోయిస్టుల ప్రభావం తగ్గినప్పటికీ.. ఆ పార్టీలో ఉమ్మడి జిల్లా నుంచి ప్రాతినిధ్యం గట్టిగానే ఉంది. కానీ ఇటీవల వరుస ఎన్‌కౌంటర్ల నేపథ్యంలో జిల్లా ప్రాతినిధ్యం గణనీయంగా తగ్గిపోయింది.
ఉమ్మడి జిల్లా నుంచి ఆ ఇద్దరే పార్టీలో కొనసాగుతున్నారు!
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 90వ దశకంలో పలు దళాల పేర్లతో పీపుల్స్ వార్ మూవ్ మెంట్ బలంగా పనిచేసింది. కానీ రాచకొండ, కనగల్, మూసీ ఏరియా, కృష్ణపట్టె దళాలు పెద్దఎత్తున పనిచేసినా.. ఆ తర్వాతి కాలంలో పోలీసులే పైచేయి సాధించారు. ప్రధానంగా తాళ్లవెల్లంల ఎన్‌కౌంటర్, నాంపల్లి, పసునూర్ గుట్టలు, గుర్రంపోడు మండలం తదితర ప్రాంతాల్లో జరిగిన ఎన్‌కౌంటర్లలో మావోయిస్టు దళాలు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయాయి. తదనంతరం ఉమ్మడి జిల్లా మావోయిస్టు ఉద్యమంలో నోముల రమణారెడ్డి, మేకల దామోదర్‌రెడ్డి, జనార్దన్ లాంటి కీలక నేతలు మావోయిస్టు ఉద్యమాన్ని విస్తరించేందుకు శతవిధాల ప్రయత్నించారు. కానీ ఈ నేతలు సైతం ఎన్‌కౌంటర్లలో చనిపోవడంతో జిల్లాలో మావోయిస్టు ఉద్యమం (Maoist Movement ) కోలుకోలేకపోయింది.
ఇదే సమయంలో వైఎస్ హయాంలో మావోయిస్టులతో చర్చల తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలో మావోయిస్టు ఉద్యమం పూర్తిగా నిలిచిపోయింది. నాలుగురైదుగురు నేతలు మాత్రం ఛత్తీస్‌ఘడ్ ప్రాంతానికి వెళ్లిపోయారు. ఫలితంగా గత 10 సంవత్సరాలుగా ఉమ్మడి జిల్లాలో మావోయిస్టు ప్రభావం పూర్తిగా తగ్గిపోయింది. నల్లగొండ జిల్లా నుంచి మావోయిస్టులు ఉన్నప్పటికీ ఒరిస్సా, ఛత్తీస్‌ఘడ్ ప్రాంతానికే పరిమితమయ్యారు. జిల్లాలో నియామకం పూర్తిగా తగ్గిపోయింది. ఇదిలావుంటే.. అప్పటికే మావోయిస్టు ఉద్యమంలో కీలకంగా ఉండి.. ఇటీవల చనిపోయిన పాక హన్మంతు మరణం తర్వాత ఉమ్మడి నల్లగొండ జిల్లా నుంచి ఇద్దరు నేతలు మాత్రమే మిగిలారు. చిట్యాల మండలం ఉరుమడ్ల గ్రామానికి చెందిన మందుగుల భాస్కర్‌రావు 2018లో ఆజ్ఞాతంలోకి వెళ్లి ఉద్యమంలో కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. అదేవిధంగా గుర్రంపోడు మండలం చామలోని బావికి చెందిన పన్నాల యాదయ్య సైతం 2018 నుంచే అజ్ఞాతంలో ఉన్నారని సమాచారం.
ఉమ్మడి జిల్లా నుంచి కీలక నేతల మరణం..
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మావోయిస్టు ఉద్యమం ఎన్నో ఎత్తుపల్లాలను చూసింది. ఈ జిల్లా ఎంతోమంది కీలక మావోయిస్టు నేతలను అందించింది. దళాల్లో సాధారణ సభ్యుడిగా మొదలై.. కేంద్ర కమిటీల్లో కీలకంగా వ్యవహరించిన నేతలు ఉన్నారు. ఎన్‌కౌంటర్లలో చనిపోయిన మావోయిస్టు నేతల్లో దాసిరెడ్డిగూడెనికి చెందిన కేంద్ర కమిటీ సభ్యుడు శ్యామల కిష్టయ్య, మిర్యాలగూడకు చెందిన రాష్ట్ర కార్యదర్శి పులి అంజయ్య, పోచంపల్లి మండలానికి చెందిన మేకల దామోదర్ రెడ్డి, వలిగొండ మండలానికి చెందిన తుమ్మల వీరారెడ్డి, వెంకన్న, గుండాల మండలానికి చెందిన మజ్జిగరాజు, రెడ్లరేపాకకు చెందిన నాగార్జునరెడ్డి, భువనగిరికి చెందిన భానుప్రసాద్ తదితరులు ప్రాణాలు కోల్పోయారు. అనంతరం పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా పనిచేసి జనజీవన సవ్రంతిలో కలిసిపోయిన సాంబశివుడు సైతం 2014లో నయీమ్ ముఠా చేతిలో హతమయ్యారు. ఇదిలావుంటే.. మావోయిస్టు ఉద్యమంలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో జిల్లా నుంచి మిగిలినవారి గురించి ఏ సమయంలో ఏం వార్త వినాల్సి వస్తుందోననే ఆందోళన ఆయా కుటుంబ సభ్యుల్లో లేకపోలేదు.


