కలం, తెలంగాణ బ్యూరో : మావోయిస్టు పార్టీ అగ్రనేత కేంద్ర కమిటీ సభ్యుడైన పసునూరి నరహరి (Pasunuri Narahari) అలియాస్ సంతోష్, ఆయన భార్య దానమ్మ అలియాస్ ధనమ్మతో కలిసి తెలంగాణ డీజీపీ సమక్షంలో లొంగిపోయారు. రెండు వారాల క్రితమే (మే 12న) వారిద్దరూ లొంగిపోయినా పోలీసులు మాత్రం మంగళవారం (మే 26న) అధికారికంగా ప్రకటించారు. డీజీపీ సీవీ ఆనంద్ (DGP CV Anand) సమక్షంలో వారిద్దరినీ పోలీసులు హాజరు పరిచారు. తెలంగాణ ప్రభుత్వం పిలుపు మేరకు లొంగిపోయిన నరహరికి రూ. 25 లక్షలు, ధనమ్మకు రూ. 20 లక్షల చొప్పున రివార్డును చెక్కు రూపంలో డీజీపీ అందజేశారు. ప్రస్తుతం ఆయన బీహార్-జార్ఖండ్ స్పెషల్ ఏరియా కమిటీ సెక్రటరీగా బాధ్యతలు చూస్తున్నారు. అదే కమిటీలో ఆయన భార్య దానమ్మ సభ్యురాలిగా ఉంటూ టెక్నికల్ యూనిట్ ఇన్‌చార్జిగా ఉన్నారు. వీరిద్దరూ కలిసి నాగ్‌పూర్‌లో పెట్టిన టెక్నికల్ యూనిట్ ఎక్స్‌పోజ్ కావడంతో దానమ్మ 2004లో అరెస్టయ్యి ఏడేండ్ల పాటు జైల్లో ఉండి 2011లో విడుదలై తిరిగి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.
హన్మకొండ జిల్లా సోమిడి గ్రామానికి చెందిన పసునూరి నరహరి 1982లో డిగ్రీ చదువుతున్న రోజుల్లోనే మావోయిస్టు ఉద్యమంలోకి వెళ్లారు. సుమారు నాలుగున్నర దశాబ్దాల పాటు పార్టీలో వివిధ హోదాల్లో పనిచేసిన ఆయన ఆయుధాలు, మోర్టార్లు, రాకెట్లు, గ్రెనేడ్ల తయారీలో నిపుణుడిగా గుర్తింపు. పదేండ్ల క్రితం (2017లో) కేంద్ర కమిటీ సభ్యుడిగా పదోన్నతి పొందారు. మావోయిస్టు పార్టీలో కేంద్ర కమిటీ పర్యవేక్షణలో నడిచే టెక్నికల్ యూనిట్ ఇన్‌చార్జిగా ఆయుధాల తయారీ, గ్రెనేడ్ తయారీ, మోర్టర్లు, షెల్స్, రాకెట్ లాంచర్ షెల్స్, బూబీ ట్రాప్స్, పేలుడు పదార్ధాల పరిశోధన తదితరాల్లో ప్రావీణ్యం సంపాదించాడు. దీర్ఘకాలం పాటు టెక్నికల్ పనులకే పరిమితమైనా 2006లో రాష్ట్రకమిటీ సభ్యుడిగా 2017లో కేంద్రకమిటీ సభ్యుడిగా పదోన్నతి పొందారు. గుంటూరు జిల్లా గామాలపాడుకు చెందిన దానమ్మ 1988లో నరహరిని పెళ్ళి చేసుకున్న తర్వాత అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. వీరిద్దరూ సరెండర్ కావడంతో మావోయిస్టు పార్టీలో మొత్తం 47 మంది మాత్రమే అజ్ఞాతంలో ఉన్నారని, ఇందులో ముగ్గురు తెలంగాణకు చెందినవారని, మిగిలినవారిలో ఆంధ్రప్రదేశ్‌కు చెందినవారు ఒకరు, చత్తీస్‌గఢ్‌కు చెందినవారు 15 మంది, ఒడిశాకు చెందినవారు మరో 15 మంది, జార్ఖండ్‌కు చెందినవారు 13 మంది ఉన్నట్లు డీజీపీ వివరించారు.
గణపతికి ప్రభుత్వ సదుపాయాలన్నీ కల్పిస్తాం : డీజీపీ
ఆపరేషన్ కగార్ మొదలైన తర్వాత తెలంగాణలో ఇప్పటివరకు మొత్తం 822 మంది సరెండర్ అయ్యారని, ఇందులో ఐదుగురు కేంద్రకమిటీ, 23 మంది రాష్ట్రకమిటీ సభ్యులున్నారు. మావోయిస్టు పార్టీకి చెందిన 58 ఏకే-47తుపాకులు, 50 ఎస్ఎల్ఆర్‌లు, 48 ఇన్సాస్ రైఫిళ్లతో సహా మొత్తం 334 ఆయుధాలు స్వాధీనమయ్యాయన్నారు. ఆపరేషన్ కగార్‌కు ముందు తెలంగాణకు చెందినవారు మావోయిస్టు పార్టీలో మొత్తం 125 మంది (పోలీసుల రికార్డుల ప్రకారం) ఉంటే ఇప్పుడు అది మూడుకు పడిపోయిందన్నారు. ప్రస్తుతం కరీంనగర్ జిల్లాకు చెందిన ముప్పాళ్ల లక్ష్మణరావు అలియాస్ గణపతి, గద్వాలకు చెందిన ఆయన భార్య రత్నాబాయ్ అలియాస్ సుజాత, సికింద్రాబాద్‌కు చెందిన వార్త శేఖర్ అలియాస్ మంగు మాత్రమే అజ్ఞాతంలో ఉన్నారని డీజీపీ వివరించారు. గణపతి సైతం సరెండర్ కావాలని డీజీపీ అప్పీల్ చేశారు. లొంగిపోతే ప్రభుత్వం తరఫున అన్ని బెనిఫిట్స్, సదుపాయాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు.
సాయుధ పోరాటానికి పరిస్థితులు అనుకూలంగా లేవు – నరహరి
“ప్రస్తుత పరిస్థితుల్లో మావోయిస్టులు చేపట్టిన సాయుధ పోరాటం చాలా కష్టంగా మారింది. జార్ఖండ్, తెలంగాణతో పాటు చాలా ప్రాంతాల్లో సాయుధ పోరాటంతో నష్టాలు చవిచూశాం. అందులో ఉన్న ఇబ్బందులు, తెలంగాణ ప్రభుత్వం కల్పిస్తున్న పునరావాస సదుపాయాలను దృష్టిలో ఉంచుకుని లొంగిపోయాం. జార్ఖండ్ పొలిట్ బ్యూరో సభ్యుడు మిసిర్ బిశ్రా అనుమతితోనే ప్రజా జీవితంలోకి వచ్చాం.” అని నరహరి వివరించారు. కొత్త జీవితానికి సహకరిస్తున్న సీఎం రేవంత్ రెడ్డికి, డీజీపీ సీవీ ఆనంద్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

