కలం, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలోని గ్రామ పంచాయతీ సిబ్బందికి ఇకపైన ప్రతి నెలా ఒకటో తేదీనే జీతాలు అందనున్నాయి. రెగ్యులర్ ఉద్యోగులకు మాత్రమే కాకుండా కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఎంప్లాయీస్‌కు సైతం ఇది వర్తించనున్నది. ఈ కేటగిరీలో పనిచేస్తున్న అన్ని శాఖల్లోని ఉద్యోగులకు కూడా ఒకటో తేదీనే శాలరీస్ ఇచ్చేలా ట్రెజరీ డిపార్టుమెంటుకు సైతం తెలంగాణ ప్రభుత్వం (Telangana Govt) ఆదేశాలు ఇచ్చింది. సంక్షేమం, గ్రామీణాభివృద్ధి సంస్థల బలోపేతమే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ఉన్నతాధికారులతో నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో ఉద్యోగుల వేతనాలు, పంచాయతీల స్వయం ప్రతిపత్తి, సామాజిక పెన్షన్ల పంపిణీపై అధికారులకు ఈ మేరకు స్పష్టమైన మార్గదర్శకాలను జారీ చేశారు. ఈ నిర్ణయం కారణంగా పంచాయతీరాజ్ డిపార్టుమెంటులోని సుమారు 50 వేల మంది సిబ్బందికి ప్రతి నెలా ఫస్ట్ తారీఖునే జీతాలు అందుతాయి. ఇందుకోసం ప్రభుత్వం ప్రత్యేకంగా రూ. 50 కోట్ల నిధులను కేటాయించనున్నది.
“ఐఏఎస్ అధికారులకు నెలనెలా సమయానికి జీతాలు అందినట్లే గ్రామ పంచాయతీ సిబ్బందికి కూడా అదే రోజున వేతనాలు అందాలి… సిబ్బంది జీతాల చెల్లింపుల్లో ఒక్కరోజు ఆలస్యమైనా సహించేది లేదు” అని సీఎం ఈ సమావేశంలో అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. వేతనాల చెల్లింపుల కోసం రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రతీ నెలా రూ. 50 కోట్లను ప్రత్యేక నిధులుగా మంజూరు చేయనున్నట్లు ప్రకటించారు. కేవలం పంచాయతీ సిబ్బందే కాకుండా ప్రభుత్వంలోని అన్ని శాఖల పరిధిలో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులందరికీ ఎలాంటి తేడా లేకుండా జీతాలు అందేలా చూడాలన్నారు. గత ప్రభుత్వం గ్రామపంచాయతీల సొంత ఆదాయంపై విధించిన ఆంక్షలను ఎత్తివేస్తూ సీఎం సాహసోపేత నిర్ణయాన్ని ప్రకటించారు. గ్రామపంచాయతీల ఆర్థిక స్వతంత్రతను నిర్వీర్యం చేస్తూ గతంలో తెచ్చిన నిబంధనను పునరుద్ధరించేందుకు అంగీకారం తెలిపారు.
తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం, 2018 లోని సెక్షన్ 70(3) ప్రతిపాదిత సవరణ ప్రకారం గ్రామ పంచాయతీల సొంత ఆదాయాన్ని ఇకపై ట్రెజరీ ఖాతాలో కాకుండా, నేరుగా బ్యాంకు ఖాతాలోనే జమచేసే విధంగా చట్ట సవరణ చేయాలని ఉన్నతాధికారులను సీఎం ఆదేశించారు. దీనివల్ల స్థానిక సంస్థలకు నిధుల వినియోగంలో మరింత స్వేచ్ఛ చేకూరనుంది. సామాజిక పింఛన్ల పంపిణీ విధానంలోనూ సీఎం కొన్ని కీలక మార్పులలకు శ్రీకారం చుట్టారు. ప్రస్తుతం పోస్టల్ శాఖ ద్వారా జరుగుతున్న పెన్షన్ల పంపిణీ విధానానికి స్వస్తి పలికి ఇకపై నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లోనే నిధులు జమ చేయాలని ఆదేశించారు. పెన్షన్ల పంపిణీలో పారదర్శకతను పెంచాలని, అర్హులైనవారికే లబ్ధి చేకూరాలని సీఎం స్పష్టం చేశారు. ఓటర్ ఐడీ, అధికారిక గుర్తింపు కార్డులు, రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన సర్వే డేటా ఆధారంగా పెన్షన్ల ప్రక్రియను పూర్తిగా క్రమబద్ధీకరించాలన్నారు. కొత్తగా మంజూరు చేసే పెన్షన్లలో ఒంటరి మహిళలకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.

