కలం, చండూరు: రాహుల్ గాంధీ అక్రమ అరెస్టును ఖండిస్తూ, కేంద్రానికి వ్యతిరేకంగా చండూరు (Chandur) మండల కేంద్రంలో కాంగ్రెస్ శ్రేణులు భారీ ధర్నా, రాస్తారోకో నిర్వహించాయి. చండూరు మున్సిపల్ ఛైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి వల్లే నీట్ పరీక్ష ప్రశ్నాపత్రం లీక్ అయిందన్నారు.
ఈ స్కామ్ కారణంగా 21 మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోవడమే కాకుండా లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టేశారన్నారు. న్యాయం కోసం గళమెత్తిన రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీని అరెస్టు చేయడం దారుణమన్నారు.
పదవికి రాజీనామా చేయాలి..
నీట్ ప్రశ్నాపత్రాల లీకేజీకి సంపూర్ణ బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే పదవికి రాజీనామా చేయాలని కోడి శ్రీనివాసులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు మేకల సాగర్ రెడ్డి , మున్సిపల్ పట్టణ అధ్యక్షులు ఐతరాజు మల్లేష్, వైస్ ఛైర్మన్ భూతరాజు దశరథ, కౌన్సిలర్లు కోడి సుష్మ వెంకన్న, బూషిపాక వాసు, కటకం రమేష్, కో ఆప్షన్ సభ్యులు, కాంగ్రెస్ నాయకులు దోటి వెంకటేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

