రాష్ట్రపతి ఉత్తర్వులు రాజ్యాంగానికి పూర్తి వ్యతిరేకం: మంద కృష్ణ మాదిగ

కలం, కరీంనగర్ బ్యూరో: 1950 రాష్ట్రపతి ఉత్తర్వులు దళితుల మెడ మీద కత్తిలాగా వేలాడుతున్నాయని , ఈ ఉత్తర్వులు రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 , 15, 25 కు పూర్తి వ్యతిరేకమైనవని, కావున వెంటనే వాటిని రద్దు చేయాలని MRPS వ్యవస్థాపక అధ్యక్షులు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ (Manda Krishna Madiga) డిమాండ్ చేశారు. కరీంనగర్ ఇందిరా భవన్ లో దళిత క్రైస్తవులు రాజ్యాంగ హక్కులు సామాజిక హోదా అనే అంశంపై మహాసభను నిర్వహించారు. ఈ సభకు పాస్టర్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు జాషువా అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మంద కృష్ణ మాదిగ మాట్లాడుతూ.. ఈ దేశంలోకి క్రైస్తవం, ఇస్లాం రాకముందు ఏ విధమైనటువంటి కుల వివక్ష ఉన్నదో, ఆ వివక్ష నేటికీ అనేక రూపాల్లో కొనసాగుతుందని అన్నారు. ఈ దేశ కుల వ్యవస్థ అన్ని మత విశ్వాసాలను ద్వితీయ స్థాయిలోకి నెట్టివేసిందని అన్నారు.

అన్ని మతాలపై ఆధిపత్యం చెలాయిస్తున్నది కుల వ్యవస్థ మాత్రమే అని మంద కృష్ణ మాదిగ అన్నారు. కుల వ్యవస్థ రద్దుకానంత కాలం దాని ప్రభావం అన్ని మతాలపై ఉంటుందని అన్నారు. అందులో భాగంగానే క్రైస్తవంలోకి వెళ్లిన దళితులు కులం కోణంలోనే అవమానాలకు, దూషణలకు, అకృత్యాలకు అత్యాచారాలకు బలి అవుతున్నారని అన్నారు. కావున ఏ మతంలోకి వెళ్లిన దళితుల మీద సామాజిక వివక్ష మారడం లేదని అన్నారు. కాబట్టి 1950 రాష్ట్రపతి ఉత్తర్వులను వెంటనే రద్దు చేయాలని లేదా సిక్కు దళితులకు, బౌద్ధ దళితులకు ఎస్సీ హోదా ఇచ్చినట్లుగానే దళిత క్రైస్తవులకు కూడా ఎస్సీ హోదా ఇవ్వాలని డిమాండ్ చేశారు.

క్రైస్తవ మతంలోకి వెళ్లిన బ్రాహ్మణ, రెడ్డి, కమ్మ, వైశ్య ఇతర అగ్రకులాల సామాజిక హోదా మారనప్పుడు కేవలం దళితుల హోదా మాత్రమే ఎందుకు మారుతుందని ప్రశ్నించారు. అలాగే క్రైస్తవంలోకి వెళ్లిన అగ్రకులాలు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు పొందుతున్నప్పుడు, క్రైస్తవంలోకి వెళ్లిన బీసీలు, ఎస్టీలు వారి రిజర్వేషన్ వాళ్ళు పొందుతున్నప్పుడు క్రైస్తవంలోకి వెళ్లిన దళితులు మాత్రమే రిజర్వేషన్ పొందడానికి ఎందుకు అనర్హులవుతారో సమాధానం కావాలని డిమాండ్ చేశారు. ఎవరి మీద లేని ఆంక్షలు కేవలం దళితుల మీదనే ఎందుకు పెడుతున్నారో ఈ వివక్షతను సమాజమంతా అర్థం చేసుకోవాలని అన్నారు.

దళిత క్రైస్తవులు మొదటి నుండి కాంగ్రెస్ పార్టీనే బలంగా నమ్మారని ,అలాంటి కాంగ్రెస్సే దళిత క్రైస్తవులకు నమ్మకద్రోహం చేసిందని అన్నారు. 1950 రాష్ట్రపతి ఉత్తర్వులు రావడానికి, దళిత క్రైస్తవులు ఎస్సీ హోదా కోల్పోవడానికి కారణం కాంగ్రెస్ పార్టీనే అని అన్నారు. దళిత క్రైస్తవులను నమ్మించి వారి ఓట్లు వేయించుకొని వారిని దారుణంగా మోసం చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీకే చెల్లుతుందని అన్నారు. 1947 నుంచి 1977 వరకు మూడు దశాబ్దాలు ఏకచత్రాధిపత్యంతో అధికారంలో ఉన్న కాంగ్రెస్ దళిత క్రైస్తవులకు న్యాయం చేయడానికి అన్ని అవకాశాలు ఉన్నప్పటికీ ఉద్దేశ పూర్వకంగానే రాష్ట్రపతి ఉత్తర్వులను రద్దు చేయకుండా అన్యాయం చేసిందని విమర్శించారు. సిక్కు దళితులకు, బౌద్ధ దళితులకు మినహాయింపులు ఇచ్చి న్యాయం చేసినట్టుగానే దళిత క్రైస్తవులకు న్యాయం చేయడంలో కాంగ్రెస్ పూర్తి వివక్షతను పాటించిందన్నారు. కాంగ్రెస్ చేసిన మోసాలను ఇకనైనా దళిత క్రైస్తవ సమాజం అర్థం చేసుకోవాలని అన్నారు.

తాను ఏ పార్టీ వాడిని కానని, తన ఒంటి మీద కండువా ఎప్పటికీ మారదని, ప్రజల కోసం నిరంతరం పని చేస్తానని అన్నారు. సుప్రీంకోర్టు దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా వర్తించదు అని తీర్పు చెబితే అన్ని రాజకీయ పార్టీలు మౌనం వహించాయని అన్నారు. దేశ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీతో పాటు ఎవరు నోరువిప్పలేదని అన్నారు. అట్లాంటి సమయంలో ఆందోళనలో, నిరాశ , నిస్పృహలో ఉన్న దళిత క్రైస్తవులకు మనోధైర్యం అందించి అండగా నిలబడాలనే ఎమ్మార్పీఎస్ ముందుకు వచ్చిందని అన్నారు. దళితులు ఏ మతంలోకి మారిన వారు దళితులుగానే ఉంటారని, కనుక అన్ని మతాల్లో ఉన్న దళితులకు గౌరవం, గుర్తింపు , హక్కులు దక్కాలన్నదే తమ విధానమని అన్నారు.

దళిత క్రైస్తవులు రాజ్యాంగ హక్కులు పొందడానికి పోరాటమే మార్గంగా ఎంచుకోవాలని అన్నారు. గతంలో సిక్కు దళితులు పోరాటం చేసి సాధించుకున్నట్లుగానే, బౌద్ధ దళితులు పోరాటం చేసే సాధించుకున్నట్లుగానే దళిత క్రైస్తవులు కూడా పోరాటం చేసి ఎస్సీ హోదాను సాధించుకోవాలని అన్నారు. ఈ పోరాటం జటిలమైనది అయినప్పటికీ ఎన్నో సవాళ్లు ఎదురుగా ఉన్నప్పటికీ వాటిని అధిగమించే శక్తిని కూడగట్టుకొని ఆత్మస్థైర్యంతో పోరాడుదాం అని అన్నారు. అంబేద్కర్ స్ఫూర్తితో లక్ష్యం వైపు ప్రయాణం చేద్దామని అన్నారు. ఇక శక్తివంతమైన ఉద్యమాన్ని నడిపి మరింత ప్రజా మద్దతును సమీకరించి పోరాటాన్ని ఉదృతం చేద్దామని.. అందుకు దళిత క్రైస్తవులు అందరూ ఏకం కావాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో, దేశంలో దళిత పాస్టర్ల మీద జరుగుతున్న దాడులను వెంటనే ఆపాలని డిమాండ్ చేశారు. దళిత క్రైస్తవుల మీద దాడులు చేస్తే ఇక సహించేది ఉండదని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమాన్ని ఉమ్మడి కరీంనగర్ జిల్లా క్రిస్టియన్ పాస్టర్ల ఫెలోషిప్ సంస్థ ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో దళిత క్రైస్తవ పాస్టర్లు జాషువా, ఎలీషా,గంగరాజు,బెన్ని,మోజెష్ బాబు రావు, సంతోష్ తదితరులున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>