కలం, వెబ్ డెస్క్: గతంలో 6956 నర్సింగ్ ఆఫీసర్ పోస్టులు భర్తీ చేశామని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ (Damodar Raja Narasimha) స్పష్టం చేశారు రెండున్నర సంవత్సరాల్లో 9 వేల నర్సింగ్ పోస్టులను భర్తీ చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కుతుందని కొనియాడారు. దాదాపు మరో 5 వేల పోస్టుల భర్తీ ప్రక్రియ కొనసాగుతోందని ప్రకటించారు. ఇందులో సుమారు 2 వేల ఏఎన్‌ఎం పోస్టుల ఫలితాలను రెండ్రోజుల్లో ప్రకటిస్తామని చెప్పారు. న్యాయపరమైన కారణాలతో ఆలస్యమైన 732 ఫార్మసిస్ట్ పోస్టుల భర్తీని కూడా త్వరలో పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ప్రతి ప్రభుత్వ హాస్పిటల్ పూర్తిస్థాయిలో సిబ్బందితో పనిచేసేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. దేశీయ, అంతర్జాతీయ అవకాశాలను దృష్టిలో ఉంచుకుని నర్సింగ్ విద్యను విస్తరిస్తున్నామని చెప్పుకొచ్చారు. హైదరాబాద్‌లో ఆరోగ్యశాఖలో ఉద్యోగాలు పొందిన 1919 మంది నర్సింగ్ ఆఫీసర్లకు మంత్రి నియామక పత్రాలు అందజేసి మాట్లాడారు.
ఈ రెండేళ్లలో కొత్తగా 16 ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలను ఏర్పాటు చేశామని.. అందులో 960 బీఎస్సీ నర్సింగ్ సీట్లను అందుబాటులోకి తీసుకొచ్చామని మంత్రి వివరించారు. విద్యానంతరం విదేశాల్లో ఉద్యోగాలు పొందేందుకు అవసరమైన స్కిల్స్‌ను ప్రభుత్వ నర్సింగ్ కాలేజీ విద్యార్థులకు నేర్పిస్తున్నామని చెప్పారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో అర్హులైన నర్సులకు ప్రమోషన్లు కల్పించామన్నారు. రాష్ట్రంలో దాదాపు 1 లక్షా 80 వేల మంది రిజిస్టర్డ్ నర్సులు సేవలందిస్తున్నారని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున ప్రతి సంవత్సరం ట్రైనింగ్, స్కిల్ అప్‌గ్రేడేషన్ కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం రాష్ట్రంలో 3 మిడ్‌వైఫరీ ట్రైనింగ్ కళాశాలలు మాత్రమే ఉన్నాయని.. మొత్తం 90 సీట్లు మాత్రమే ఉన్నాయని స్పష్టం చేశారు.దశలవారీగా అన్ని ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలకు మిడ్‌వైఫరీ ట్రైనింగ్ కోర్సును అందుబాటులోకి తీసుకొస్తామని మంత్రి హామీ ఇచ్చారు. దీనివల్ల మాతా-శిశు ఆరోగ్య సేవలు మెరుగుపడతాయని అభిలషించారు. ప్రభుత్వ దవాఖాన్లలో సాధారణ ప్రసవాల సంఖ్య పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

