ఛాంపియన్స్ లీగ్‌కు చేరువలో మాంచెస్టర్ యునైటెడ్!

కలం, స్పోర్ట్స్ : మాంచెస్టర్ యునైటెడ్ (Manchester United) జట్టు అద్భుత ఫామ్‌ను కొనసాగిస్తోంది. తాజాగా బ్రెంట్‌ఫోర్డ్‌తో జరిగిన మ్యాచ్‌లో 2-1 గోల్స్ తేడాతో విజయం సాధించి, వచ్చే సీజన్ ఛాంపియన్స్ లీగ్ అర్హతకు అడుగు దూరంలో నిలిచింది. ప్రస్తుతం ప్రీమియర్ లీగ్ పట్టికలో మూడో స్థానంలో ఉన్న యునైటెడ్, ఆరో స్థానంలో ఉన్న బ్రైటన్ కంటే 11 పాయింట్ల ఆధిక్యంలో ఉంది. ఓల్డ్ ట్రాఫోర్డ్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో యునైటెడ్ ఆరంభం నుంచే దూకుడు ప్రదర్శించింది. ఆట 11వ నిమిషంలోనే సీనియర్ మిడ్‌ఫీల్డర్ కాసెమిరో అద్భుతమైన హెడర్ గోల్‌తో జట్టుకు 1-0 ఆధిక్యాన్ని అందించారు.

బ్రూనో ఫెర్నాండెజ్ వేసిన కార్నర్‌ను మగువైర్ అందుకోగా, దానిని కాసెమిరో గోల్‌గా మలిచారు. ఈ సీజన్ ముగిశాక క్లబ్ వదిలి వెళ్లనున్న కాసెమిరోను మరో ఏడాది ఉండాలని అభిమానులు కోరుతూ నినాదాలు చేశారు. ఆ తర్వాత ఆట 43వ నిమిషంలో బెంజమిన్ సెస్కో రెండో గోల్ చేసి ఆధిక్యాన్ని 2-0కు పెంచారు. బ్రూనో ఫెర్నాండెజ్ అందించిన పాస్‌ను సెస్కో గోల్ పోస్ట్‌లోకి పంపారు. కాగా, ఈ సీజన్‌లో బ్రూనోకు ఇది 19వ అసిస్ట్ కావడం విశేషం. బ్రెంట్‌ఫోర్డ్ ఆటగాడు మథియాస్ జెన్సన్ 87వ నిమిషంలో ఒక గోల్ చేసి మ్యాచ్‌లో ఉత్కంఠ పెంచినప్పటికీ, యునైటెడ్ రక్షణ శ్రేణి పటిష్టంగా నిలబడి విజయాన్ని ఖాయం చేసింది.

రూబెన్ అమోరిమ్ స్థానంలో తాత్కాలిక కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన మైఖేల్ కారిక్, జట్టును అద్భుతంగా నడిపిస్తున్నారు. గత మ్యాచ్‌లో చెల్సియాపై గెలిచిన యునైటెడ్, ఇప్పుడు మరో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. మిగిలిన నాలుగు మ్యాచ్‌ల్లో కేవలం రెండు పాయింట్లు సాధిస్తే చాలు, యునైటెడ్ అధికారికంగా ఛాంపియన్స్ లీగ్‌కు అర్హత సాధిస్తుంది. వచ్చే ఆదివారం తమ చిరకాల ప్రత్యర్థి లివర్‌పూల్‌తో యునైటెడ్ తలపడనుంది. ఈ మ్యాచ్ ఫలితం పాయింట్ల పట్టికలో మూడో స్థానాన్ని ఎవరు దక్కించుకుంటారో నిర్ణయించనుంది. ప్రస్తుతానికైతే యునైటెడ్ జట్టు పూర్తి ఆత్మవిశ్వాసంతో కనిపిస్తోంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>