కలం, ఆదిలాబాద్: జాతీయ ఎయిడ్స్ నియంత్రణ (AIDS Control) మండలి ఆదేశాల మేరకు జిల్లాలో ఎయిడ్స్ నియంత్రణకు సంబంధించిన నిర్దేశిత లక్ష్యాలను వంద శాతం సాధించాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా (Collector Rajarshi Shah) అధికారులను ఆదేశించారు. జిల్లా ఎయిడ్స్ నియంత్రణా విభాగ సిబ్బందితో మంగళవారం జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఎయిడ్స్ సురక్ష (మాస్) పనితీరుపై సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రస్తుతం ఉన్న ‘సాక్షం’ స్థితి నుంచి పూర్తి స్థాయి ‘సురక్షిత్’ సాధించేలా పకడ్బందీ ప్రణాళికలు రూపొందించాలని జిల్లా వైద్యాధికారి, అదనపు వైద్యాధికారులను ఆదేశించారు. జిల్లాలోని రక్త నిధి కేంద్రాల ద్వారా ప్రజలకు మెరుగైన, సురక్షితమైన రక్త సరఫరా అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. సేకరించిన ప్రతి రక్త యూనిట్‌ను నిబంధనల ప్రకారం కచ్చితంగా పరీక్షించాలని, ఒకవేళ హెచ్ఐవీ లేదా సిఫిలిస్ లక్షణాలు ఉన్నట్లు తేలితే వెంటనే ఐసీటీసీ కేంద్రాల ద్వారా నిర్ధారణ పరీక్షలు నిర్వహించాలన్నారు.
ఆ బాధితులకు రిమ్స్ ఆసుపత్రిలోని ఏఆర్టీ కేంద్రం ద్వారా ఉచితంగా మందులు అందేలా తగిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. జిల్లా ఎయిడ్స్ నియంత్రణ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన వివిధ పోటీలలో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు కలెక్టర్ నగదు బహుమతులతో పాటూ ప్రశంస పత్రాలను అందజేశారు.

