కలం, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర కొత్త డీజీపీగా సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ సీవీ ఆనంద్ (CV Anand) నియమితులయ్యారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెండో ఫుల్ టైమ్ డీజీపీ ఈయనే. పస్ట్ ఫుల్ టైమ్ డీజీపీగా అనురాగ్ శర్మ వ్యవహరించారు. ఆ తర్వాత అడ్‌హక్, ఇన్‌చార్జి, ఎఫ్ఏసీ, తాత్కాలిక.. ఇలా పలువురు డీజీపీలు పనిచేశారు. యూపీఎస్సీ ఆమోదంతో, డీవోపీటీ నిబంధనల మేరకు ఫుల్ టైమ్ డీజీపీగా ఇప్పుడు ఆనంద్ నియమితులయ్యారు. ప్రస్తుత డీజీపీ శివధర్‌రెడ్డి ఈ నెల 30 రిటైర్ అవుతున్నారు. ఆయన నుంచి సీవీ ఆనంద్ బాధ్యతలు తీసుకోనున్నారు. వివిధ జిల్లాల ఎస్పీగా, పోలీసు కమిషనర్‌గా, హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్‌గా, హోంశాఖ కార్యదర్శిగా పనిచేసిన ఆయన ఇప్పుడు హెడ్ ఆఫ్ ది పోలీస్ ఫోర్స్ గా నియామకం అయ్యారు. హైకోర్టు వివాదం సమసిపోవడంతో ఈ నెల 27 తర్వాత నియామక ఉత్తర్వులు వస్తాయంటూ పోలీసు వర్గాలు ముందుగానే అంచనా వేశాయి. ఆ ప్రకారమే జీవో జారీ అయింది.
సంస్కరణల్లో, క్రమశిక్షణలో ప్రత్యేక శైలి :
హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌లో టాపర్‌గా నిలిచి నిజాం కాలేజీ, ఉస్మానియా వర్శిటీలో ఉన్నత విద్య పూర్తి చేసిన సీవీ ఆనంద్ (CV Anand) ఫస్ట్ అటెంప్ట్‌లోనే 22 ఏళ్ల వయసులో ఐపీఎస్‌గా ఎంపికయ్యారు. దాదాపు మూడున్నర దశాబ్దాల కెరీర్‌లో పలు కీలక విభాగాల్లో పనిచేసి సంస్కరణలకు ఆద్యుడు అనే గుర్తింపు పొందారు. మావోయిస్టు ఉద్యమం ఉత్తర తెలంగాణలో ఉధృతంగా ఉన్న సమయంలో నిజామాబాద్, వరంగల్ జిల్లాల్లో పనిచేసి ఆ కార్యకలాపాలను అణచివేసి ప్రెసిడెంట్ గ్యాలంట్రీ అవార్డు పొందారు. నగర పోలీసు కమిషనర్‌గా పనిచేస్తున్నప్పుడు ట్రాఫిక్ పోలీసు విభాగంలో ‘ఈ-చలాన్’ వ్యవస్థకు శ్రీకారం చుట్టారు. డ్రంకెన్ డ్రైవింగ్ తనిఖీల్లో కొత్త ఒరవడిని సృష్టించారు. ‘షీ టీమ్స్’, ‘షీ షటిల్స్’ లాంటి కార్యక్రమాలతో మహిళల భద్రతకు భరోసా కల్పి,చారు. వినాయక చవితి, బక్రీద్ లాంటి పండుగల సందర్భంలో మత కల్లోలాలకు తావులేకుండా ఇరు పక్షాలతో ముందుగానే మాట్లాడి ప్రశాంతంగా పూర్తయ్యేలా చొరవ తీసుకున్నారు.
డ్రగ్స్ నియంత్రణలో వినూత్న ఆచరణ :
నగర పోలీసు కమిషనర్‌గా పనిచేస్తున్నప్పుడే మాదకద్రవ్యాల నియంత్రణ, నివారణకు హెచ్-న్యూ అనే ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసి కట్టడి చర్యలపై దృష్టి సారించారు. టెక్నాలజీని సైతం విస్తృతంగా వినియోగంలోకి తీసుకొచ్చిన సీవీ ఆనంద్ సివిల్ సప్లైస్ కమిషనర్‌గా పనిచేస్తున్న సమయంలో ‘ఈ-పాస్’ మెషీన్లను ప్రవేశపెట్టి అవినీతికి ఆస్కారం లేకుండా చేశారు. నిధులు దారిమళ్ళకుండా చూశారు. కొంతకాలం కేంద్ర సర్వీసుల్లో పనిచేసిన ఆయన దేశవ్యాప్తంగా ఎయిర్‌పోర్టుల భద్రతపై ప్రత్యేక ఫోకస్ పెట్టారు. క్రికెటర్‌గా రంజీ ట్రోఫీ స్థాయికి వెళ్ళిన సీవీ ఆనంద్ శారీరకంగా ఫిట్‌నెస్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారని సహచర పోలీసు అధికారులో గొప్పగా చెప్పుకుంటారు. రాష్ట్రపతి పోలీస్ మెడల్, గ్యాలంట్రీ అవార్డ్, దుబాయ్‌లో జరిగిన వరల్డ్ పోలీస్ సమ్మిట్‌లో డ్రగ్స్ నియంత్రణలో విశేష కృషికి అంతర్జాతీయ అవార్డు అందుకున్నారు.
Read Also: అమ్రాబాద్ అడవుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్
Follow Us On : WhatsApp

