కలం, రామగుండం: సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయి అప్పుల ఊబిలోకి జారుకుందని బీజేపీ నేత, మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్ (Eatala Rajender) ఆరోపించారు. ఒకప్పుడు వేల కోట్ల రూపాయల డిపాజిట్లతో అలలలాడిన సంస్థ, నేడు కార్మికులకు జీతాలు చెల్లించడానికి కూడా బ్యాంకుల నుండి రుణాలు తీసుకోవాల్సిన దయనీయ స్థితికి చేరిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గ పరిధిలోని ఎన్టీపీసీ కృష్ణానగర్‌లో మంగళవారం పర్యటించిన ఆయనకు బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు.
అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈటల రాజేందర్ మాట్లాడారు. కాంట్రాక్టర్ల చేతుల్లో ఓపెన్ కాస్ట్ సింగరేణి యాజమాన్యం తీరు వల్ల కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. సంస్థలోని ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టులన్నీ కాంట్రాక్టర్ల గుత్తాధిపత్యంలోకి వెళ్ళిపోయాయని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం సింగరేణికి చెల్లించాల్సిన బకాయిలను ఆలస్యం చేయకుండా వెంటనే విడుదల చేయాలని, కంపెనీ ఆర్థిక స్థితిని పరిరక్షించాలని డిమాండ్ చేశారు.
లాభాల్లో వాటాను తక్షణమే ప్రకటించాలి..
సింగరేణి కార్మికులకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంతో పాటు, లాభాల్లో రావలసిన వాటాను తక్షణమే ప్రకటించాలని ఈటల ఒత్తిడి తెచ్చారు. కార్మికుల అసంతృప్తి ఆగ్రహంగా మారకముందే ప్రభుత్వం స్పందించాలని హెచ్చరించారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ఇచ్చిన హామీలు అమలవలేదని, ఇప్పుడు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే వైఖరిని కొనసాగిస్తోందని మండిపడ్డారు. రాష్ట్రంలో రైతులకు కనీసం 8 గంటల విద్యుత్ కూడా సరిగ్గా అందడం లేదని ఈటల ఆరోపించారు.
లో-వోల్టేజీ, నాసిరకం విద్యుత్ సరఫరా వల్ల వ్యవసాయ మోటార్లు కాలిపోయి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని తెలిపారు. రాజకీయాలను పక్కన పెట్టి, కాళేశ్వరం ప్రాజెక్టులోని లోపాలను సరిచేసి రైతులకు సాగునీరు అందించాలని డిమాండ్ చేశారు. అధికారంలోకి వచ్చి ఇన్ని రోజులైనా కాంగ్రెస్ తన హామీలను నెరవేర్చడంలో విఫలమైందని ఆయన విమర్శించారు.

