కాంగ్రెస్, బీఆర్ఎస్ దొంగ నాటకాలను తిప్పికొడతాం: బండి సంజయ్

కలం, కరీంనగర్ బ్యూరో: “కేంద్ర ప్రభుత్వం నిధులు (Central Government Funds) ఇస్తే… ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం డబ్బాలు కొట్టుకోవడమే సరిపోతోంది.. రాష్ట్రంలో అభివృద్ధికి రూపాయి దిక్కులేదు గానీ, చరిత్రను తుడిచేసే కుట్రలు మాత్రం జోరుగా సాగుతున్నాయి” అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) మండిపడ్డారు.

బుధవారం కరీంనగర్ కలెక్టరేట్ ఆవరణలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నగరాభివృద్ధికి కేంద్రం ఇచ్చే నిధులే మూలాధారమని బండి సంజయ్ స్పష్టం చేశారు. కరీంనగర్ ప్రజల సంక్షేమం, నగర సమగ్ర వికాసం కోసం రూ. 900 కోట్లకు పైగా పనులను కేంద్రం ద్వారా తీసుకొచ్చినట్లు వెల్లడించారు. ఆధునిక డ్రైనేజీ వ్యవస్థ, చెత్త రహిత నగరం, మానేరు నదీతీర వికాస పనులకు. రూ.840 కోట్ల యూసీఎఫ్ నిధులతో శ్రీకారం చుట్టినట్లు పేర్కొన్నారు.

రూ. 25 కోట్లతో మల్టీ లెవల్ పార్కింగ్, టవర్ సర్కిల్ ప్రాంతంలో ట్రాఫిక్, పార్కింగ్ సమస్యలకు శాశ్వత పరిష్కరిస్తున్నట్లు చెప్పారు. రూ. 16.50 కోట్లతో కమాండ్ కంట్రోల్, రూ. 5.70 కోట్లతో సెంట్రల్ లైబ్రరీతో యువత, విద్యార్థుల భవిష్యత్తు కోసం నేడే అంకితం చేస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 4వ తేదీన కేంద్ర హోంమంత్రి అమిత్ షా కరీంనగర్ వేదికగా పర్యటించనున్నారని వెల్లడించారు.

హిందూ విద్రోహ కుట్రలను సహించేది లేదు

పాఠ్యపుస్తకాల సిలబస్ మార్పుల ఊహాగానాలపై స్పందిస్తూ, “ఆర్టికల్ 370 తెస్తామనా? కాశ్మీర్ పాకిస్తాన్‌ది అని రాస్తారా? రజాకార్ల దౌర్జన్యాలు దాచేసి నిజాంను మహానాయకుడిగా చూపిస్తారా? ఇలాంటి ప్రయత్నాలను ఎంతమాత్రం సహించేది లేదు” అని హెచ్చరించారు. దేవుళ్ల మధ్య చిచ్చుపెట్టి రాజకీయ ప్రయోజనాలు పొందాలని చూస్తే హిందూ సమాజం తగిన బుద్ధి చెబుతుందన్నారు.

కాంగ్రెస్ – బీఆర్ఎస్ మ్యాచ్ ఫిక్సింగ్

రాష్ట్రంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు కలిసి దొంగ నాటకాలు ఆడుతున్నాయని, ఒకరినొకరు విమర్శించుకుంటూ ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీలను పక్కదారి పట్టిస్తున్నాయని విమర్శించారు. ఈ రెండు పార్టీల దొంగ దండయాత్రను తిప్పికొట్టి, ప్రజల తరఫున పోరాడేది ఒక్క భారతీయ జనతా పార్టీ మాత్రమేనని బండి సంజయ్ స్పష్టం చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>