Mobile Popup Ad
Mobile Popup Ad

‘బాల పంచాయత్’ కు హాజరైన ఎమ్మెల్యే కవ్వంపల్లి, సీపీ గౌస్ ఆలం

కలం, కరీంనగర్ బ్యూరో : ప్రజపాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా తెలంగాణ రాష్ట్ర పోలీస్ మహిళా భద్రత విభాగం (Women Safety Wing) ఆధ్వర్యంలో గ్రామీణ ప్రాంతాల్లో బాలల భాగస్వామ్యాన్ని పెంపొందించేందుకు, వారి సమస్యలపై చర్చించే వేదికగా ‘బాల పంచాయత్’ (Bala Panchayat ) కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా కరీంనగర్ ఉమెన్ సేఫ్టీ వింగ్, యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ సంయుక్త ఆధ్వర్యంలో మానకొండూరు మండలంలో మహిళలు, బాలలకు “చిల్డ్రన్ పార్లమెంట్ – బాల పంచాయత్” అనే ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ​ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ, కరీంనగర్ పోలీస్ కమిషనర్ (సీపీ) గౌష్ ఆలం విడివిడిగా మాట్లాడుతూ.. బాలల వికాసం, మహిళల రక్షణపై దిశా నిర్దేశం చేశారు. ​

పిల్లల్లో నాయకత్వ లక్షణాలు పెంపొందాలి: ఎమ్మెల్యే

ఈ సందర్భంగా మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ… ​”బాలల హక్కుల పరిరక్షణకు, వారిలో నాయకత్వ వికాసానికి ‘బాల పంచాయత్’ ఒక అద్భుతమైన వేదిక. ఈ కార్యక్రమం ద్వారా పిల్లలు తమ గ్రామం, పాఠశాల, కుటుంబం, సమాజానికి సంబంధించిన సమస్యలను స్వయంగా గుర్తించి, చర్చించి పరిష్కారాలను వెతకడం అభినందనీయం. ఇది వారిలో ఆత్మవిశ్వాసాన్ని, బాధ్యతాయుతమైన పౌరసత్వాన్ని పెంపొందిస్తుంది. ఆరోగ్యం, విద్య, బాలల రక్షణ వంటి కీలక అంశాలపై పిల్లలు తమ అభిప్రాయాలను ధైర్యంగా వ్యక్తం చేస్తూ గ్రామాభివృద్ధిలో చురుకుగా భాగస్వాములు కావాలి” అని చెప్పారు.

​మహిళల భద్రతకు షీ టీమ్స్ భరోసా.. ‘స్నేహిత’తో బాలికల రక్షణ: సీపీ

​కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం మాట్లాడుతూ… “సమాజంలో మహిళలు, బాలల రక్షణకు కరీంనగర్ పోలీస్ శాఖ అత్యంత ప్రాధాన్యత ఇస్తోంది. జిల్లాలో బాలికలను రక్షించేందుకు వినూత్న కార్యక్రమాలు చేపడుతున్నాం. ఇందులో భాగంగానే కరీంనగర్‌లో ‘స్నేహిత’ అనే కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేస్తున్నాం. జిల్లాలోని పాఠశాలలు, కళాశాలల్లో ప్రత్యేకంగా ‘సీక్రెట్ బాక్స్’ (Secret Box) లను ఏర్పాటు చేయాలని ఆదేశించాం.విద్యార్థినులు తమకు ఎదురయ్యే ఎలాంటి సమస్యలనైనా, వేధింపులనైనా ఈ సీక్రెట్ బాక్సుల ద్వారా రాతపూర్వకంగా ఫిర్యాదు చేయవచ్చు. ఈ బాక్సులకు తాళాలు వేసి ఉంచుతామని, వాటి తాళం చెవులు పూర్తిగా మహిళా కానిస్టేబుళ్ల ఆధీనంలోనే ఉంటాయి. దీనివల్ల బాలికలకు పూర్తి రక్షణ లభిస్తుంది” అని వెల్లడించారు.

మహిళలు, విద్యార్థినులు ఎలాంటి వేధింపులు ఎదురైనా అధైర్య పడకుండా తక్షణమే షీ టీమ్స్ (SHE Teams) సేవలను వినియోగించుకోవాలని కమిషనర్ గౌష్ ఆలం సూచించారు. బాధితులు నేరుగా కాకుండా మొబైల్ నంబర్ 8712670759 ద్వారా కూడా వాట్సాప్ లేదా కాల్ చేసి ఫిర్యాదు చేయవచ్చని వెల్లడించారు. ఫిర్యాదు చేసిన వారి వివరాలను సంపూర్ణంగా గోప్యంగా ఉంచుతామన్నారు. మహిళా భద్రత విభాగం డైరెక్టర్ జనరల్ చారు సిన్హా, ఐపీఎస్ పిలుపు మేరకు బాలలను చైతన్యవంతమైన పౌరులుగా తీర్చిదిద్దడంలో ఈ బాల పంచాయత్‌లు కీలక పాత్ర పోషిస్తాయని చెప్పారు. ​ఈ అవగాహన సదస్సులో అదనపు కలెక్టర్ డి. శ్రీనివాస్ రెడ్డి, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ (CWC) చైర్ పర్సన్ ధనలక్ష్మి, చైల్డ్ ప్రొటెక్షన్ అధికారి పర్విన్, ఏసీపీ విజయకుమార్, ఇన్స్పెక్టర్లు శ్రీలత, పుల్లయ్య, రమేష్‌లతో పాటు షీ టీమ్స్, యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ విభాగానికి చెందిన సభ్యులు, స్థానిక మహిళలు మరియు బాలలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>