కలం, వెబ్ డెస్క్: రాష్ట్రంలో బీఆర్ఎస్ నేతలు అడుగడుగునా అభివృద్ధికి అడ్డం పడుతున్నారని సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) పేర్కొన్నారు. వాళ్లు ఎంత అడ్డుకున్నా అభివృద్ధి ఆగదని చెప్పారు. శనివారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రంగారెడ్డి జిల్లా కోహెడలో ఇంటిగ్రేటెడ్ ఫ్రూట్ మార్కెట్, సబ్-రిజిస్ట్రార్ కార్యాలయ సముదాయానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. బీఆర్ఎస్ నేతలు దశాబ్దకాలంలో ఒక శతాబ్దకాలానికి చేయాల్సిన విధ్వంసం చేశారని మండిపడ్డారు. అయినా మేం ముందుకు సాగుతున్నామన్నారు. తెలంగాణ రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ పెరిగిందని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఔటర్ రింగ్ రోడ్డు వచ్చిన అనంతరం వ్యవసాయ భూమి పోయి రియల్ ఎస్టేట్ అయ్యిందని పేర్కొన్నారు. రైతులు పత్తి, వరి, మొక్కజొన్న, మిర్చీ లాంటి పంటలతో పాటూ కూరగాయలు, పండ్లు కూడా పండించాలని పిలుపునిచ్చారు.
ఎంపీగా ఉన్నప్పుడే రైతుల కష్టాలు చూశాను
తాను ఎంపీగా ఉన్నప్పుడే రైతుల కష్టాలు చూశానని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. అందుకే తాను కోహెడ ఫ్రూట్ మార్కెట్ నిర్మించాలని నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏమాత్రం సహకరించడం లేదని ఆరోపించారు. తాను ఫామ్‌హౌస్‌లో ఉన్న కేడీని అయినా.. ఢిల్లీలో ఉన్న మోడీని చూసి కూడా భయపడేది లేదని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం తమకు ఏ మాత్రం సహకరించడం లేదని ఆరోపించారు. ధాన్యం కొనుగోలు చేయడం లేదని.. మెట్రో విస్తరణకు డబ్బులు ఇవ్వలేదని ఆరోపించారు. కచ్చితంగా వారిని ప్రశ్నిస్తామన్నారు. కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ నోటికివచ్చినట్టు మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు.

