‘రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి(Chandrababu)ని మరో గంటలో చంపేస్తా’ అంటూ మంగళగిరి పోలీసులకు ఒక వ్యక్తి బెదిరింపు కాల్ చేశారు. ఈ అంశం స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. వెంటనే అలెర్ట్ అయిన పోలీసులు.. ఫోన్ ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరు చేశారు? అని వాయువేగంతో దర్యాప్తు చేశారు. వెంటనే నిందితుణ్ణి అదుపులోకి కూడా తీసుకున్నారు. ప్రస్తుతం అతడిని విచారిస్తున్నామని, అసలు ఫోన్ ఎందుకు చేశాడు? తానే చేశాడా? ఎవరైనా చేయించారా? అన్న కోణాల్లో విచారణ జరుగుతున్నట్లు సంబంధిత వర్గాల నుంచి అందుతున్న సమాచారం. అయితే ఈ ఘటన గురువారం మధ్యాహ్నం జరిగింది.
పోలీసులు చెప్పిన దాని ప్రకారం.. గురువారం మధ్యాహ్నం మంగళగిరి డైల్ 100కు ఒక ఫోన్ వచ్చింది. ఫోన్‌లోని వ్యక్తి ‘సీఎం చంద్రబాబు(Chandrababu)ను గంటలో చంపుతా’ అని బెదిరింపులకు పాల్పడ్డాడు. వెంటనే దర్యాప్తు చేసిన పోలీసులు గంటల వ్యవధిలోనే ఫోన్ చేసిన వ్యక్తిని మంగళగిరి రత్నాల చెరువు ప్రాంతానికి చెందిన ఇసునూరి వెంకట నాగేశ్వరరావుగా గుర్తించారు. ఆ ఫోన్ కాల్ డీజీపీ కార్యాలయం నుంచి నేరుగా గుంటూరు జిల్లా ఎస్పీ కంట్రోల్‌రూమ్‌కు ట్రాన్స్‌ఫర్ అయింది. సెల్ టవర్ లొకేషన్ ఆధారంగా ఫోన్ ఎక్కడి నుంచి వచ్చిందో గుర్తించి మంగళగిరి గ్రామీణ పోలీసులను అప్రమత్తం చేశారు. వారు వెంటనే సదరు వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.
Read Also: రోహిత్, కోహ్లీ రిటైర్‌మెంట్ కోసమే ఎదురుచూపులు: అశ్విన్

