సూర్యాపేటలో హైడ్రామా.. “నేను మావోయిస్టు” అంటూ వ్యక్తి ప్రత్యక్షం

కలం, సూర్యాపేట : సూర్యాపేట (Suryapet) జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయం బుధవారం ఒక వింతైన, తీవ్ర కలకలం రేపిన ఘటనకు వేదికైంది. తాను మావోయిస్టు (Maoist) ను అంటూ ఒక వ్యక్తి ఒక్కసారిగా ఎస్పీ కార్యాలయంలో ప్రత్యక్షమవ్వడం స్థానికంగా పెద్ద సంచలనంగా మారింది. పోలీసుల కథనం ప్రకారం.. ‘దేవేంద్రాచారి అలియాస్ జగన్’ అనే వ్యక్తి సూర్యాపేట జిల్లా ఎస్పీ కార్యాలయానికి చేరుకున్నాడు. తాను గతంలో మావోయిస్ట్ పార్టీలో కీలకమైన వెపన్స్ తయారీ విభాగం (ఆయుధాల తయారీ వింగ్) లో పనిచేశానని అక్కడి అధికారులకు వెల్లడించాడు.

ఇప్పుడు తాను జనజీవన స్రవంతిలో కలవాలని భావిస్తున్నానని, అందుకే లొంగిపోయేందుకు వచ్చానని పోలీసులకు సమాచారం ఇచ్చాడు. తాను మావోయిస్టునంటూ ఆ వ్యక్తి చెప్పిన వివరాలతో ఒక్కసారిగా అప్రమత్తమైన పోలీస్ ఉన్నతాధికారులు.. వెంటనే లోతుగా విచారణ ప్రారంభించారు. మావోయిస్టు రికార్డులను, పాత డైరీలను జల్లెడ పట్టారు. అయితే, పోలీస్ రికార్డుల్లో ఎక్కడా కూడా ‘దేవేంద్రాచారి అలియాస్ జగన్’ అనే పేరు గానీ, అతనికి సంబంధించిన ఎలాంటి సమాచారం గానీ లభించలేదు.

దీంతో సదరు వ్యక్తి తీరుపై, అతను చెబుతున్న వివరాలపై పోలీసులకు తీవ్ర అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఆయుధాల తయారీ విభాగంలో పనిచేశానని చెబుతున్న మాటల్లో నిజమెంత? అసలు ఇతని నేపథ్యం ఏమిటి? ఏదైనా వ్యూహంతోనే ఎస్పీ ఆఫీసుకు వచ్చాడా? లేక మానసిక స్థితి సరిగ్గా లేక ఇలా ప్రవర్తిస్తున్నాడా? అనే కోణంలో అనుమానాలు బలపడ్డాయి.

ఈ హైడ్రామాపై పూర్తిస్థాయి నిజా నిజాలను తేల్చేందుకు సూర్యాపేట పోలీసులు రంగంలోకి దిగారు. విషయం అత్యంత సున్నితమైనది కావడంతో, సదరు వ్యక్తిని సమగ్ర విచారణ కోసం హైదరాబాద్‌లోని ఇంటెలిజెన్స్ వింగ్ – ఎస్‌ఐబీకి తరలించారు. ఎస్‌ఐబీ అధికారులు దేవేంద్రాచారిని క్షుణ్ణంగా విచారించిన అనంతరం.. ఈ హైడ్రామా వెనుక ఉన్న అసలు వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ ఘటన ప్రస్తుతం ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>