సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కొత్త పార్టీ : లక్ష దాటిన సభ్యత్వాలు !

కలం, వెబ్‌ డెస్క్ : సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చేసిన ఒక వ్యాఖ్య దేశంలో సరికొత్త డిజిటల్ విప్లవానికి దారితీసింది. నిరుద్యోగులు బొద్దింకల్లా తయారయ్యారంటూ సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ చేసిన వ్యాఖ్యలపై యువత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఈ నేపథ్యంలోనే వ్యవస్థపై డిజిటల్ శైలిలో నిరసన తెలపడానికి ఒక 30 ఏళ్ల యువకుడు సరికొత్త ప్రయోగానికి తెరలేపాడు. అభిజీత్ దీష్కే (Abhijeet Dipke) అనే యువకుడు ఏకంగా ‘కాక్రోచ్ జనతా పార్టీ’  (Cockroach Janata Party) పేరిట ఒక వ్యంగ్య రాజకీయ పార్టీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచాడు.

సెక్యులర్, సోషలిస్ట్, డెమోక్రటిక్, లేజి (సోమరితనం) అనేవి తమ పార్టీ ప్రధాన నినాదాలని వ్యవస్థాపకుడు అభిజీత్ ప్రకటించాడు. ప్రజల సొమ్ము ఎటు పోతుందో నిలదీయడమే తమ పార్టీ ముఖ్య ఉద్దేశమని స్పష్టం చేశాడు. ఈ పార్టీలో చేరడానికి వినూత్నమైన అర్హతలను ప్రకటించడం విశేషం. నిరుద్యోగం, సోమరితనం కలిగి ఉండటం, నిరంతరం సోషల్ మీడియాకు అతుక్కొని బతకడం, వ్యవస్థపై ఉన్న కోపాన్ని అద్భుతంగా ఎత్తిచూపే నైపుణ్యం ఉండటం లాంటి విచిత్రమైన కండిషన్లను పెట్టాడు.

ఈ వినూత్న ఆలోచన డిజిటల్ ప్రపంచంలో విపరీతంగా దూసుకుపోతోంది. పార్టీ ప్రకటించిన అతికొద్ది రోజుల్లోనే దాదాపు లక్షకు పైగా సభ్యత్వాలు నమోదు కావడం విశేషం. ఈ పార్టీ క్రేజ్ కేవలం సాధారణ యువతకే పరిమితం కాలేదు. ప్రముఖ రాజకీయనాయకులు కూడా ఇందులో భాగస్వామ్యం కావడానికి ఆసక్తి చూపిస్తున్నారు. కాక్రోచ్ జనతా పార్టీలో చేరడానికి తాము సిద్ధంగా ఉన్నామంటూ టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా, మాజీ క్రికెటర్ అలాగే టీఎంసీ నేత కీర్తి ఆజాద్, సామాజిక కార్యకర్త అంజలి భరద్వాజ్ లాంటి ప్రముఖులు ట్వీట్ చేశారు. ఈ ట్వీట్లకు స్పందించి సీజేపీ (CJP) అధినేత.. పార్టీలోకి వచ్చే ప్రముఖులందరికీ సాదర స్వాగతం పలుకుతామని తెలిపాడు.

ప్రస్తుతం ఒక సోషల్ మీడియా హాస్యాస్పద ప్రయోగంగా ప్రారంభమైన ఈ పార్టీ భవిష్యత్తులో దేశంలోనే ఒక పెద్ద జెన్జీ (Gen Z) ఉద్యమంగా మారుతుందా అనే కోణంలో రాజకీయ నిపుణులు చర్చించుకుంటున్నారు. రాబోయే రోజుల్లో ఈ పార్టీ ఎలా పనిచేయాలి, ఎలాంటి వ్యూహాలతో ముందుకు వెళ్లాలి అనే అంశాలపై త్వరలోనే ఒక ఆన్‌లైన్ సదస్సు నిర్వహిస్తామని అభిజీత్ దీష్కే ప్రకటించాడు. యువత డిజిటల్ అస్త్రంతో చేస్తున్న ఈ వినూత్న రాజకీయం ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>