తెలంగాణ కాన్‌స్టిట్యూషన్ క్లబ్‌కు సన్నాహాలు.. అసెంబ్లీ వద్దే నిర్మాణం?

కలం, తెలంగాణ బ్యూరో: ఢిల్లీలో పనిచేస్తున్న కాన్‌స్టిట్యూషన్ క్లబ్ (Constitution Club) తరహాలోనే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక భవనాన్ని నిర్మించాలని భావిస్తున్నది. గత ప్రభుత్వంలోనే ఈ ఆలోచన వచ్చినా అర్ధాంతరంగా ఆగిపోయింది. ఇటీవల శాసన వ్యవహారాల మంత్రి, అసెంబ్లీ స్పీకర్, మండలి చైర్మన్ తదితరులతో ముఖ్యమంత్రి చర్చించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. అసెంబ్లీ ఆవరణలోనే కాన్‌స్టిట్యూషన్ క్లబ్‌ను నిర్మించాలనే అంచనాకు వచ్చినట్లు తెలిసింది.

ఇందుకు అవసరమైన రెవెన్యూ, రోడ్లు-భవనాల శాఖ అనుమతులతో పాటు క్లబ్ నిర్మాణానికి కావాల్సిన లైసెన్స్ తదితరాలపై డాక్యుమెంటేషన్ వర్క్ చేపట్టాలనే ఆదేశాలు ప్రభుత్వం నుంచి వెలువడినట్లు తెలిసింది. గతంలో ఆదర్శ్ నగర్‌లోని న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ ప్రాంగణంలో నిర్మించాలని భావించినా అసెంబ్లీ పరిసరాల్లో నిర్మించడమే ఉత్తమమనే నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. క్యాబినెట్ లో చర్చించి తుది నిర్ణయం తీసుకోబోతున్నట్టు సమాచారం

హెరిటేజ్ కట్టడాలకు ఇబ్బంది లేకుండా

అసెంబ్లీ పరిసరాల్లోని జూబ్లీ హాల్, జవహర్ బాలభవన్ లాంటి హెరిటేజ్ కట్టడాలకు ఇబ్బంది లేకుండా చూడాలని ప్రభుత్వం భావిస్తున్నది. తొలుత జూబ్లీ హాల్ భవనం ఉన్న ప్రాంతంలోనే నిర్మించాలని భావించినప్పటికీ దానికి ఉన్న హెరిటేజ్ స్టేటస్ దృష్టిలో ఉంచుకొని దాని పక్కనే కట్టాలని నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. గత ప్రభుత్వంలో అసెంబ్లీ మీదుగా మెట్రో రైల్ లైన్ వేయాలనే చర్చ జరిగినప్పుడు జూబ్లీ హాల్‌ను కూల్చివేయాల్సి ఉంటుందనే అంశాన్ని అధికారులు ప్రభుత్వానికి వివరించారు. కానీ హెరిటేజ్ స్టేటస్‌తోనే ప్లానింగ్ మార్చాల్సి వచ్చింది. ఇప్పుడు కూడా కాన్‌స్టిట్యూషన్ క్లబ్ నిర్మాణం కోసం జూబ్లీ హాల్‌కు ఉన్న హెరిటేజ్ స్టేటస్‌ను తొలగించేలా ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేస్తుందా? లేక పక్కన ఉన్న భవనాన్ని కూల్చి ఆ స్థలంలో నిర్మిస్తుందా? దీనిపై త్వరలో క్లారిటీ రానున్నది.

జూబ్లీహాల్ భవనం కొనసాగాలన్న సీఎం

జూబ్లీ హాల్‌కు ప్రత్యేక సాంస్కృతిక వారసత్వం ఉన్నదని, దాన్ని పరిరక్షించాలని పలు సందర్భాల్లో పేర్కొన్నారు.
–కాన్ఫెడరేషన్ ఆఫ్ చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులతో 2024 సెప్టెంబరు 27న జరిగిన సమావేశంలో ‘ప్రస్తుతం శాసనమండలి ఉన్న జూబ్లీ హాల్‌కు చారిత్రక ప్రాధాన్యం ఉన్నది. జూబ్లీహాల్‌ను సీఐఐ దత్తత తీసుకుని పరిరక్షించాలి’ అని వ్యాఖ్యానించారు.
– జూబ్లీ హాల్ కు పక్కన ఉన్న స్థలంలో కాన్‌స్టిట్యూషన్ క్లబ్ నిర్మాణం కావచ్చన్నది ఒక వాదన. దాదాపు రూ. 40 కోట్ల ఖర్చుతో నిర్మిస్తున్న ఈ భవనం ప్రస్తుత, మాజీ ప్రజాప్రతినిధుల సమావేశాలకు అనువుగా ఉండేలా నిర్మించాలని సీఎం భావిస్తున్నారు.

హార్టికల్చర్ డిపార్టుమెంట్ స్థల సేకరణ

జూబ్లీహాల్‌లో కొనసాగుతున్న శాసనమండలి ఇప్పటికే శాసనసభ భవనంలోకి షిప్ట్ అయింది. రెండింటికి వీలుగా ఒక సెంట్రల్ హాల్ నిర్మాణం గురించి సీఎం పలు సూచనలు చేశారు. ఉభయ సభలూ ఇప్పటికే దాదాపుగా అనుకున్న తీరులో ఒకే భవనంలో కొనసాగుతున్నందున త్వరలో సెంట్రల్ హాల్, భవిష్యత్తులో కాన్‌స్టిట్యూషన్ క్లబ్ నిర్మాణమైతే వాహనాల పార్కింగ్ కోసం కూడా కొంత స్థలం అవసరమవుతుంది. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని అదనంగా అవసరమయ్యే స్థలాన్ని హార్టికల్చర్ డిపార్టుమెంటు నుంచి తీసుకునే అవకాశాలున్నాయి. ప్రస్తుతం వివిధ పార్టీల శాసనసభాపక్షాల కార్యాలయాలు కొనసాగుతున్న భవనాల స్థానంలో కొత్తవి నిర్మాణం కానున్నట్లు తెలిసింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>