కలం, వెబ్ డెస్క్: బిజీ లైఫ్ నుంచి ఉపశమనం పొందడానికి కేరాఫ్ అడ్రస్‌గా నిలవాల్సిన ఫామ్‌హౌస్‌లు.. ఇటీవల కాలంలో అసాంఘిక కార్యకలాపాలకు (Hyderabad Crime Hubs) అడ్డాలుగా మారుతున్నాయి. నగర శివార్లలో జనసంచారానికి దూరంగా ఉండే ఈ ప్రాంతాలను కొంతమంది తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. రేవ్ పార్టీలు, డ్రగ్స్ సంస్కృతి నుంచి మొదలుకొని.. చివరకు లైంగిక దాడులు, ఘోర హత్యల వరకు ఫామ్‌హౌస్‌లు అడ్డగా మారుతున్నాయి. ఇటీవల జరుగుతున్న నేరాలు తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తున్నాయి. సిటీ శివార్లలో ఏ చిన్న నేరం జరిగినా.. దాని వెనుక ఏదో ఒక ఫామ్‌హౌస్ లింకు బయటకు రావడం ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది.
ఇటీవల వెలుగుచూసిన బండి భగీరథ్‌కు సంబంధించిన పోక్సో (POCSO) కేసు ఈ ధోరణికి అద్దం పడుతోంది. మొయినాబాద్‌లోని ఓ ఫామ్‌హౌస్ వేదికగా మైనర్ బాలికపై లైంగిక దాడి జరిగిందన్న ఆరోపణలు, అనంతరం నమోదైన కేసులు తీవ్ర సంచలనం సృష్టించాయి. పోలీస్ ఉన్నతాధికారుల ఆదేశాలతో ప్రత్యేక పోలీసు బృందాలు రంగంలోకి దిగి, ఫామ్‌హౌస్ రికార్డులను, సీసీటీవీ ఫుటేజీలను జల్లెడ పడుతున్నాయి. ఎలాంటి నిఘా లేకపోవడంతో అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయి.
మరోవైపు మొయినాబాద్ పరిధిలోనే వెలుగుచూసిన ఇద్దరు మహిళల జంట హత్యల కేసు ఫామ్‌హౌస్‌ల పరాకాష్టగా నిలిచింది. తాండూరుకు చెందిన ఇద్దరు వృద్ధ మహిళలను కిడ్నాప్ చేసి, అప్పులు ఎగ్గొట్టే వ్యూహంతో ఫామ్‌హౌస్‌కు పిలిపించి దారుణంగా హత్య చేసి పూడ్చిపెట్టారు. పోలీసుల దర్యాప్తులో కరీమాబీ దంపతులు తమకు అప్పు ఇచ్చిన మరో ఆరుగురు మహిళలను కూడా అదే ఫామ్‌హౌస్‌కు పిలిపించి వరుస హత్యలకు ప్లాన్ చేసినట్లు తేలడం విస్తుగొలుపుతోంది. కేవలం విలాసాలకే కాకుండా, ఘోరాలకు ఫామ్‌హౌస్‌లు (Farmhouses) వేదికవుతుండటంతో పోలీసులు వీటిపై నిఘా పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

