ఎక్కడ దాక్కున్నా వదలేదేలే: పోలీసులకు ఆయుధంగా ‘నాట్‌గ్రిడ్’!

కలం, వరంగల్‌ బ్యూరో: సాంకేతిక పరిజ్ఞానం విస్తరిస్తుండగా నేరాల స్వరూపం కూడా మారుతోంది. ముఖ్యంగా సైబర్‌ నేరగాళ్లు రాష్ట్రాలు, దేశాలు దాటి మోసాలకు పాల్పడుతుండడంతో వారిని గుర్తించి పట్టుకోవడం పోలీసులకు సవాల్‌గా మారింది. నేరగాళ్లు సాంకేతికత ఆధారంగా తప్పించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. అదే సాంకేతికతను పోలీసులు విస్తృతంగా వినియోగించుకునేందుకు, నేరాల దర్యాప్తును మరింత పటిష్టం చేసేందుకు నేషనల్‌ ఇంటెలిజెన్స్‌ గ్రిడ్‌(నాట్రిగ్రిడ్‌) (NATGRID) దిశగా పోలీసులు సిద్ధమయ్యారు. వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌లో సైబర్‌ క్రైమ్‌, లా అండ్‌ ఆర్డర్‌ విభాగాలకు చెందిన పోలీసులకు నాట్రిగ్రిడ్‌పై ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు.

ఆధారాలన్నీ ఒకేచోట..

సాధారణంగా ఒక నేరానికి సంబంధించిన వివరాలు వేర్వేరు మార్గాల్లో పోలీసులకు అందుతుంటాయి. ఫోన్‌ నంబర్లు, ఆర్థిక లావాదేవీలు, ప్రయాణ వివరాలు, నిందితుల మధ్య సంబంధాలు, గతంలో నమోదైన కేసులు వంటి సమాచారాన్ని విడివిడిగా పరిశీలించాల్సి ఉంటుంది. అయితే నాట్రిగ్రిడ్‌ వంటి సాంకేతిక వ్యవస్థల ద్వారా అందుబాటులో ఉన్న సమాచారాన్ని అనుసంధానం చేసి విశ్లేషించే అవకాశం ఉంటుంది. దీంతో ఒక నిందితుడికి సంబంధించిన వివిధ ఆధారాల మధ్య సంబంధాలను గుర్తించడం పోలీసులకు సులభతరం కానుంది.

నేర చరిత్రపై నిఘా..

నిందితుడి గత నేరచరిత్ర, అతడితో సంబంధం ఉన్న వ్యక్తులు, నేరాలకు ఉపయోగించిన మార్గాలు, కదలికలు వంటి అంశాలను విశ్లేషించడంలో ఈ వ్యవస్థ ఉపయోగపడనుంది. ముఖ్యంగా ఒక నేరానికి సంబంధించి దర్యాప్తు ప్రారంభించినప్పుడు దాని వెనుక ఉన్న పెద్ద నెట్‌వర్క్‌ను గుర్తించేందుకు ఇది దోహదపడనుంది. ఒక రాష్ట్రంలో నేరం చేసి మరో రాష్ట్రానికి వెళ్లిపోయే నిందితుల విషయంలోనూ వివిధ సమాచారాన్ని అనుసంధానం చేయడం ద్వారా దర్యాప్తుకు సహకారం లభించనుంది.

అంతర్రాష్ట్ర ముఠాలపై పట్టు

సైబర్‌ నేరాలతో పాటు ఆర్థిక నేరాలు, మోసాలు, ఇతర అంతర్రాష్ట్ర నేరాల్లోనూ నాట్రిగ్రిడ్‌ వినియోగం దర్యాప్తు అధికారులకు ఉపయోగపడనుంది. ఒక నేరంలో పట్టుబడిన వ్యక్తికి గతంలో ఎక్కడైనా కేసులు నమోదయ్యాయా? అతడికి ఇతర నేరస్థులతో సంబంధాలున్నాయా? ఒకే తరహా నేరాలు ఎక్కడెక్కడ జరిగాయి? వంటి అంశాలను విశ్లేషించేందుకు ఇది దోహదపడనుంది. దీంతో చిన్న కేసుల వెనుక ఉన్న పెద్ద నేర ముఠాలను గుర్తించే అవకాశం పెరగనుంది.

సైబర్‌ నేరాలపై ప్రత్యేక దృష్టి

వరంగల్‌ కమిషనరేట్‌ పరిధిలో సైబర్‌ నేరాల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో నాట్రిగ్రిడ్‌ వినియోగం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇప్పటివరకు 2,400 సైబర్‌ కేసుల్లో రూ.6.85 కోట్ల మేర నష్టం నమోదైనట్లు పోలీసుల లెక్కలు చెబుతున్నాయి. ఆన్‌లైన్‌ మోసాలు, బ్యాంకింగ్‌ మోసాలు, ఇతర సైబర్‌ నేరాల్లో నిందితులు నకిలీ ఖాతాలు, వేర్వేరు ఫోన్‌ నంబర్లు, ఇతర రాష్ట్రాల్లోని వ్యక్తుల ఖాతాలను ఉపయోగిస్తుండటంతో దర్యాప్తు సంక్లిష్టంగా మారుతోంది. ఇలాంటి కేసుల్లో సమాచారాన్ని అనుసంధానం చేసి నిందితుల నెట్‌వర్క్‌ను గుర్తించడంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం కీలకంగా మారనుంది.

పోలీసులకు సాంకేతిక నైపుణ్యం

నాట్రిగ్రిడ్‌ను సమర్థంగా వినియోగించడంతో పాటు అందులో లభించే సమాచారాన్ని దర్యాప్తు ప్రక్రియలో ఎలా ఉపయోగించుకోవాలనే అంశాలపై వరంగల్‌ కమిషనరేట్‌ పోలీసులకు శిక్షణ ఇస్తున్నారు. ముఖ్యంగా సైబర్‌ క్రైమ్‌ దర్యాప్తు అధికారులతో పాటు లా అండ్‌ ఆర్డర్‌ పోలీసులకు కూడా ఈ సాంకేతిక వ్యవస్థపై అవగాహన కల్పిస్తున్నారు. ఆధునిక సాంకేతికతను పోలీసింగ్‌తో అనుసంధానం చేయడం ద్వారా నేరాల నియంత్రణతో పాటు కేసుల దర్యాప్తును వేగవంతం చేయాలన్నదే ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తోంది. మొత్తంగా నేరస్తులు సాంకేతికతను అడ్డుపెట్టుకుని తప్పించుకునే ప్రయత్నాలు చేస్తున్న తరుణంలో అదే సాంకేతికతను పోలీసులూ ఆయుధంగా మార్చుకుంటున్నారు. నాట్రిగ్రిడ్‌ వినియోగంతో నేరస్తుల కదలికలు, సంబంధాలపై నిఘా మరింత పటిష్టమైతే “ఎక్కడ దాక్కున్నా.. జాడ కనిపెట్టే” స్థాయిలో దర్యాప్తు వ్యవస్థ మరింత బలోపేతం కానుంది.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>