కలం, వెబ్‌డెస్క్: భారతీయ సాంప్రదాయంలో జుట్టు సంరక్షణకు తలకు నూనె రాయడం అనేది తరతరాలుగా వస్తున్న ఒక ముఖ్యమైన అలవాటు. అయితే, ప్రస్తుత ఆధునిక జీవనశైలి, సమయాభావం లేదా జిడ్డుతనం నచ్చకపోవడం వల్ల చాలా మంది జుట్టుకు నూనె రాయడం పూర్తిగా మానేస్తున్నారు. జుట్టుకు నూనె రాయకపోవడం వల్ల జుట్టు రాలిపోయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు నిపుణులు.
ఎక్కువ రోజులు నూనె రాసుకోకపోవడం, కుదుళ్లలోని చర్మం పొడిబారిపోవడం వల్ల చుండ్రు, పేలు.. వంటి సమస్యలొస్తాయట. ఫలితంగా తలలో దురద పుడుతుంది. ఈ సమస్య తీవ్రమైతే జుట్టు దృఢత్వాన్ని కోల్పోయి ఎక్కువగా రాలిపోయే ప్రమాదం ఉంటుందంటున్నారు నిపుణులు. అందుకే ఈ చిన్న చిన్న నిమయాలు (Hair Care Tips) పాటించడం వల్ల జుట్టు కుదుళ్లలో దురద రాకుండా నివారించవచ్చని సూచిస్తున్నారు. అవేంటో తెలుసుకుందాం.
వారానికి ఒకసారి తలకు నూనె రాయడం
కొంతమంది సమయం లేదనో లేదంటే ముఖం జిడ్డుగా కనిపిస్తుందనో తలకు నూనె రాయడం మానేస్తుంటారు. దీంతో కుదుళ్లు పొడిబారిపోయి దురద వస్తుందని హెచ్చరిస్తున్నారు. అలాగే జుట్టు కూడా నిర్జీవమైపోతుందట. అందుకే కొబ్బరి, బాదం, ఆలివ్.. వంటి నూనెల్ని కనీసం వారానికోసారైనా తలకు పట్టించాలంటున్నారు నిపుణులు. దీనివల్ల దురద రాకుండా ఉండడంతో పాటు.. జుట్టు కూడా పట్టులా మెరుస్తుందంటున్నారు.
ఆయిల్‌తో మసాజ్
సరైన రక్తప్రసరణ లేకపోవడం వల్ల కూడా కుదుళ్ల ఆరోగ్యం దెబ్బతింటుంది. కాబట్టి నూనె రాసుకునే ముందు దాన్ని కాస్త గోరువెచ్చగా చేసుకుని.. దాంతో కుదుళ్లపై కాసేపు మసాజ్ చేయాలట. ఫలితంగా కుదుళ్లకు రక్తప్రసరణ బాగా జరిగి దురద తగ్గే అవకాశం ఉంటుందట. నూనె రాసిన తర్వాత జిడ్డుగా ఉందనిపిస్తే.. కాసేపయ్యాక గాఢత తక్కువగా ఉన్న షాంపూతో తలస్నానం చేస్తే జుట్టు సిల్కీగా మారుతుందట.
తలస్నానం తర్వాత ఈ తప్పు చేయకండి
చాలామంది తలస్నానం చేసిన తర్వాత జుట్టు పూర్తిగా ఆరకముందే గట్టిగా జడ వేసుకోవడం లేదంటే రబ్బర్ బ్యాండ్ పెట్టుకోవడం లాంటివి చేస్తుంటారు. దీనివల్ల జుట్టు కుదుళ్లు పూర్తిగా ఆరవు. దీంతో ఆ ప్రదేశంలో ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు నిపుణులు. ఇలాంటి సందర్భాల్లో కూడా దురద వచ్చే అవకాశం ఉంటుందట. కాబట్టి జుట్టు పూర్తిగా ఆరేదాకా అలా వదిలేయడం లేదంటే వదులుగా ఫక్కర్ పెటుకొని వదిలేయడం మంచిదని సూచిస్తున్నారు నిపుణులు.

