కలం, కరీంనగర్ బ్యూరో: పుష్కరాలకు ముందే గోదావరి తీరంలోని ఆలయాలకు సరికొత్త శోభ తీసుకురావడానికి రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతుందని రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ (Minister Adluri Laxman kumar) అన్నారు. ఆదివారం జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం కోటిలింగాల గ్రామంలోని శ్రీ కోటేశ్వర స్వామి ఆలయంలో మంత్రి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడా లేనివిధంగా రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి గోదావరి పుష్కరాలకు ఏడాది ముందుగానే ఏర్పాట్లు చేయడానికి బడ్జెట్‌లో నిధులు కేటాయించారని అన్నారు.
గోదావరి తీరం వెంట బాసర నుంచి భద్రాచలం వరకు ఉన్న ఆలయాల అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించినట్లు మంత్రి తెలిపారు. ఇందులో భాగంగా ధర్మపురి నియోజకవర్గంలోని ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి క్షేత్ర అభివృద్ధికి నిధులతో పాటు, కోటి లింగాలలోని కోటేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి రూ.10 కోట్లు కేటాయించినట్లు వివరించారు. ధర్మపురి పుష్కరాల కోసం రూ.117 కోట్లు కేటాయించారు. ఇందులో కోటిలింగాలలో పుష్కర ఘాట్ నిర్మాణానికి రూ.8 కోట్లు, కోటిలింగాల నుండి పాశీగాం వరకు రోడ్డు నిర్మాణానికి రూ.8 కోట్లు కేటాయించినట్లు మంత్రి తెలిపారు.
ధర్మపురి ఉగ్ర నరసింహ స్వామి ఆలయ అభివృద్ధికి రూ.10 కోట్లు కేటాయించగా వెల్గటూర్ నుండి కోటిలింగాల వరకు నాలుగు లైన్ల రహదారి విస్తరణ కోసం రూ.20 కోట్లు కేటాయించినట్లు మంత్రి తెలిపారు. కోటిలింగాలతో పాటు రాజక్క పల్లి వద్ద మినీ ట్యాంక్ బండ్ మాదిరిగా నిర్మాణం చేస్తామని మంత్రి తెలిపారు. పుష్కరాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తామని వెల్లడించారు.
సీఎం సహాయనిధి చెక్కు అందజేత
కోటిలింగాల గ్రామానికి చెందిన మంచి కట్ల మణితేజ ఇటీవల కుక్క కాటుకు గురై మరణించాడు. ప్రభుత్వం నుంచి మంజూరైన రూ.5 లక్షల చెక్కును మంత్రి అడ్లూరి లక్ష్మణ్ మణితేజ కుటుంబ సభ్యులకు మంత్రి అందజేశారు. వెల్గటూర్ మండల కేంద్రంలో ప్రభుత్వం మంజూరు చేసిన సింగం రాజేశ్వరి-తిరుపతి ఇందిరమ్మ ఇంటి గృహ ప్రవేశంలో అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొన్నారు.

