మా కాలేజీ కూల్చుతారా?.. అక్బరుద్దీన్ సంచలన వ్యాఖ్యలు

కలం, వెబ్ డెస్క్: హైదరాబాద్ బండ్లగూడ కల్సా ప్రాంతంలోని సల్కం చెరువు ఎఫ్‌టీఎల్ పరిధిలో ఫాతిమా కాలేజీ నిర్మాణం జరిగిందన్న ఆరోపణలపై మజ్లిస్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ (Akbaruddin Owaisi) ఘాటుగా స్పందించారు. “ఒక విద్యాసంస్థను కూల్చితే కొత్తవి పది నిర్మిస్తాం. నేను లేకపోయినా ఆ విద్యాసంస్థలు కొనసాగుతాయి. ఆ భవనాలను తీసుకెళ్లినా నేను చెట్టు నీడలో కూర్చొని పిల్లలకు పాఠాలు చెప్తాను. కానీ, ఎవరికీ తలవంచను”అని వ్యాఖ్యానించారు. చంద్రాయణ్‌గుట్టలో ఆదివారం జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, తనకు సంబంధించిన విద్యాసంస్థలను లక్ష్యంగా చేసుకుని కొందరు అధికారాలను దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. ఎప్పుడూ నిజాయితీగా పనిచేశానని, ఒత్తిడులకు తలొగ్గే ప్రసక్తే లేదన్నారు. ఫాతిమా విద్యాసంస్థల నిర్మాణాలకు సంబంధించిన అనుమతులపై హైకోర్టు విచారణ చేపట్టిన నేపథ్యంలో అక్బరుద్దీన్ చేసిన కామెంట్లకు ప్రాధాన్యత ఏర్పడింది.

ప్రభుత్వంపై హైకోర్టు అసహనం

– సల్కం చెరువు ప్రాంతంలోని నిర్మాణాలకు ఎలాంటి అనుమతులు ఇచ్చారో వారంలోగా వివరాలను సమర్పించాలని జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ అధికారులను హైకోర్టు ఈ నెల 3న ఆదేశించింది.
– ఫాతిమా కళాశాల భవనాలు సల్కం చెరువు ఎఫ్టీఎల్ (ఫుల్ ట్యాంక్ లెవెల్)లో ఉన్నాయంటూ గతంలో విజయ్ గోపాల్ అనే ఆర్టీఐ యాక్టివిస్టు, న్యాయవాది పిటిషన్ దాఖలు చేశారు. ఆక్రమణలను ప్రభుత్వ యంత్రాంగం పట్టించుకోలేదంటూ హైకోర్టు ఆక్షేపించింది.
– ఈ సమయంలో అక్బరుద్దీన్ వ్యాఖ్యలు రాజకీయంగా, న్యాయపరంగా చర్చనీయాంశంగా మారాయి. హైకోర్టు తదుపరి విచారణ సందర్భంగా హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ సమర్పించే నివేదికలు కీలకం కానున్నాయి. ఆ నివేదికలను పరిశీలించిన తర్వాత హైకోర్టు ఎలాంటి ఉత్తర్వులు ఇస్తుందనేది కూడా ఆసక్తికరం.

గతంలో హైకోర్టు ఏం వ్యాఖ్యలు చేసింది?

సల్కం చెరువు ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్‌లో అక్రమ నిర్మాణాలు జరిగినప్పటికీ హైడ్రా ఎలాంటి చర్యలూ తీసుకోలేదని విజయ్ గోపాల్ తన పిటిషన్‌లో ప్రస్తావించారు. ఫాతిమా ఓవైసీ ఎడ్యుకేషనల్ క్యాంపస్‌తో పాటు ఇతర నిర్మాణాలతో చెరువు ఆక్రమణకు గురైందని పేర్కొన్నారు. ఈ పిటిషన్‌ను విచారణకు తీసుకున్న జస్టిస్ శ్రవణ్ కుమార్ బెంచ్.. సల్కం చెరువు ఆక్రమణలపై సంబంధిత శాఖల నుంచి ఏప్రిల్ 13న వివరాలు కోరారు. చెరువును ఆక్రమించినట్లు ప్రాథమికంగా కనిపిస్తున్నదని వ్యాఖ్యానించారు. ఆ తర్వాత ఏప్రిల్ 30న జరిగిన విచారణ సందర్భంగా హైడ్రా సహా ప్రభుత్వ అధికారులను ప్రశ్నించారు. సమాజంలో పలుకుబడి ఉన్న వ్యక్తులకు చెందిన సంస్థలపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని నిలదీశారు. అందులో చదువుతున్న విద్యార్థులు, తల్లిదండ్రులకు కేసు విషయాన్ని తెలియజేయాలని ఆదేశించారు. సంబంధిత శాఖల కార్యదర్శులు, బాధ్యులైన అధికారులపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.

వారం రోజుల టైమ్ ఇస్తున్నాం

– ఆ రెండు విచారణలకు కొనసాగింపుగా ఈ నెల 3న జస్టిస్ శ్రవణ్ కుమార్ తదుపరి విచారణ చేపట్టారు. ప్రభుత్వ శాఖల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇప్పటికే ఏప్రిల్ 13, ఏప్రిల్ 30 తేదీల్లో ఇచ్చిన ఆదేశాలు అమలు కాలేదన్నారు.
– 3 నెలలు గడిచినా పూర్తి వివరాలు కోర్టు ముందు ఎందుకు ఉంచలేదని నిలదీశారు. చివరి అవకాశంగా వారం గడువు ఇస్తున్నామని, నివేదికలు సమర్పించకపోతే తగిన ఆదేశాలు జారీ చేయాల్సి వస్తుందని హెచ్చరించారు.
– జీహెచ్‌ఎంసీ మంజూరు చేసిన భవన అనుమతుల పూర్తి రికార్డులు, సల్కం చెరువు ఎఫ్‌టీఎల్ సరిహద్దుల అధికారిక నిర్ధారణ, ఆ స్థలంలో విద్యాసంస్థలు నిర్వహించేందుకు ఇచ్చిన అనుమతుల వివరాలు, సంబంధిత శాఖల అధికారులు తీసుకున్న చర్యలపై సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.
– విచారణ సందర్భంగా స్కూల్ ఎడ్యుకేషన్ తరఫున హాజరైన న్యాయవాది వివరణ ఇస్తూ.. వివాదాస్పద భవనంలో ప్రస్తుత (2026-27) విద్యా సంవత్సరానికి 1 నుంచి 10వ తరగతి వరకు తరగతులు నిర్వహించేందుకు స్కూల్కు అనుమతి ఇవ్వలేదని తెలిపారు. ఇంటర్‌మీడియెట్, అండర్ గ్రాడ్యుయేట్ తరగతుల వ్యవహారం తమ విభాగం పరిధిలోకి రాదని పేర్కొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>