కలం, నిర్మల్: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రోస్టర్ విధానంతో మాల నిరుద్యోగులకు అన్యాయం జరుగుతోందని, వారి భవిష్యత్తు ప్రమాదంలోకి నెడుతోందని మాల కో ఆర్డినేషన్ ఫోరం (Mala Coordination Forum) రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ ఎం.ఎఫ్.గోపీనాథ్ అన్నారు. రోస్టర్ పాయింట్ సవరించాలని డిమాండ్ చేస్తూ ఆదివారం నిర్మల్ జిల్లా కేంద్రంలోని టీఎన్జీవో సంఘం భవనంలో జిల్లా సదస్సు నిర్వహించారు.
ఈ సందర్బంగా గోపీనాథ్ మాట్లాడుతూ.. మాల జాతి పరిరక్షణకు ఐక్యంగా ఉద్యమించాల్సిన అవసరం ఉందన్నారు. వర్గీకరణలో మాలలకు విద్య, ఉద్యోగ నియామకాల్లో అన్యాయం జరుగుతోందని ఆరోపించారు. రోస్టర్ పాయింట్‌ను సవరించే వరకు అంబేడ్కర్, మహాత్మా జ్యోతిరావు పూలే ఆశయాల స్ఫూర్తితో ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ఫోరం రాష్ట్ర నాయకుడు పి.శంకర్, జిల్లా నాయకులు రంజిత్, డాక్టర్ సురేష్, డాక్టర్ రమేష్, డాక్టర్ దామెర రాములు, తదితరులు పాల్గొన్నారు.

