కలం, కరీంనగర్ బ్యూరో: జగిత్యాల ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ సొంత గ్రామమైన జగిత్యాల రూరల్ మండలం అంతర్గాం గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రాంగణం (Anthargom School) మందుబాబులకు అడ్డాగా మారింది. పాఠశాల ప్రాంగణంలో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయన్న ఆరోపణలతో విద్యార్థులు, తల్లిదండ్రులు, గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. పాఠశాల అంటే దేవాలయంతో సమానంగా భావిస్తామని, అలాంటి విద్యాలయ ప్రాంగణంలో మద్యం సేవించడం వంటి కార్యకలాపాలు జరుగుతున్నాయంటూ గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
పాఠశాల పరిసరాల్లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా సంబంధిత పోలీసు అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు. ఈ విషయమై స్థానిక ఎమ్మెల్యే పాఠశాల పరిసరాలపై ప్రత్యేక దృష్టి సారించాలని గ్రామస్థులు విజ్ఞప్తి చేస్తున్నారు. గ్రామంలో అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేసేందుకు పోలీసులు నిఘా పెంచి, పాఠశాల ప్రాంగణంలో రాత్రివేళల్లో గస్తీ నిర్వహించాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు. విద్యార్థుల భద్రత, పాఠశాల పవిత్రతను కాపాడేందుకు విద్యాశాఖ, పోలీసు అధికారులు సమన్వయంతో చర్యలు చేపట్టి, పాఠశాల ప్రాంగణాన్ని అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉంచాలని గ్రామ ప్రజలు సంభందిత అధికారులను కోరుతున్నారు.

