కలం, నిజామాబాద్ బ్యూరో: నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో మోస్తారు వర్షాలు (Nizamabad Rains) కురుస్తున్నాయి. శనివారం రాత్రి భారీ వర్షం కురిసింది. ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆకాశం మేఘావృతం కాగా.. సాయంత్రం మోస్తారు వర్షం కురిసింది. తాజా వర్షాలకు తోడు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతుండటంతో అన్నదాతల్లో మళ్ళీ ఆశలు చిగురిస్తున్నాయి. ఆగస్టు మొదటి నుంచి రెండు వారాలు ఆశించిన స్థాయిలోనే వర్షాలు కురిశాయి. మళ్ళీ వర్షాలు ముఖం చాటేసి గత రెండ్రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో ఇప్పటికే సింహభాగం చెరువులు నిండుకుండలా మారాయి. అయితే పంటపొలాలకు ఈ వరుస వర్షాలు కూడా జీవం తీసుకువచ్చినట్టు అవుతుందని రైతులు అంటున్నారు.
నిరాశాజనకంగా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు..
ఉత్తర తెలంగాణ వర ప్రదాయిని శ్రీరాం సాగర్ ప్రాజెక్టు (SRSP) నీటి మట్టం నిరాశాజనకంగా మారింది. గతసారితో పోలిస్తే ఆగస్టు 23 నాటికి పరిశీలిస్తే వరద ఇప్పటివరకూ ఆశించిన స్థాయిలో రాలేదు. రెండ్రోజుల వరకూ వెయ్యి క్యూసెక్కుల వరద మాత్రమే రాగా ఆదివారం 2640 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తుంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 1091 అడుగులు 80 టీఎంసీలు కాగా.. ఆదివారం సాయంత్రం వరకూ 1079.70 అడుగులు, 44.266 టీఎంసీల నీటి సామర్థ్యం ఉంది. తాగు సాగు నీటి అవసరాల కోసం 1013 క్యూసెక్కుల నీటిని కాలువల ద్వారా పంపుహౌజ్ ల ద్వారా విడుదల చేస్తున్నారు.
గతేడాది ఇదే రోజున నీటి మట్టం సామర్థ్యం గమనిస్తే 1090 అడుగుల నీటిమట్టం 80 టీఎంసీల సామర్థ్యం కలిగి ఉంది. దాన్ని బట్టి గతేడాది, ఈసారి పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఎల్ నినో ప్రభావంతో అసలు 44 టీఎంసీలు రావడమే గగనంగా అంత స్థాయిలో వస్తుందని కూడా అనుకోలేదు. ఇటీవల అల్పపీడిన ప్రభావం వరదలతో ప్రాజెక్టు సగం నిండింది. ఇంకా భారీ వర్షాలు కురిసి పూర్తి స్థాయిలో నిండుకుండలా మారాలని అన్నదాతలు ఆశిస్తున్నారు.

