జీవో 97ను రద్దు చేయాల్సిందే.. సర్కార్‌పై గంగుల ఫైర్

కలం, కరీంనగర్ బ్యూరో: కరీంనగర్ జిల్లా కేంద్రంలోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ మోడల్ గురుకుల పాలిటెక్నిక్ మహిళా కళాశాలలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ప్రభుత్వ తాజా నిర్ణయంతో తమ భవిష్యత్తు అగమ్యగోచరంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్న విద్యార్థినులకు బీఆర్ఎస్ మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ (Gangula Kamalakar) అండగా నిలిచారు. కళాశాలను సందర్శించి విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించిన ఆయన వారి గోడును సానుభూతితో ఆలకించి ధైర్యం చెప్పారు. జీవో నెంబర్ 97ను వెంటనే రద్దు చేసి పూర్వపు పాలిటెక్నిక్ విద్యా విధానాన్ని కొనసాగించాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని తీవ్రంగా డిమాండ్ చేశారు.

విద్యార్థుల కన్నీటి పర్యవసానం..

కళాశాలకు విచ్చేసిన ఎమ్మెల్యే గంగుల ఎదుట విద్యార్థినులు తమ గోడును వెళ్లబోసుకుంటూ కన్నీటి పర్యంతమయ్యారు. పాలిటెక్నిక్ విద్యా విధానాన్ని మార్చివేస్తే భవిష్యత్తులో తాము ఎంతో ఆశపడే ‘ఈ-సెట్’ (ECET) రాసే అవకాశం కోల్పోతామని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విధానం వల్ల పేద, మధ్యతరగతి విద్యార్థులకు ఇంజనీరింగ్ చదువులు పూర్తిగా దూరమవుతాయని వాపోయారు. ముఖ్యంగా ప్రస్తుతం మూడో సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు రాబోయే రోజుల్లో ఎలాంటి అవకాశాలు ఉంటాయో, పరీక్షలు ఎలా ఉంటాయో అర్థం కాక దిక్కుతోచని స్థితిలో ఉన్నామని తమ ఆందోళనను వెల్లడించారు. విద్యార్థుల ముఖాల్లోని ఆందోళనను గమనించిన గంగుల వారికి అభయమిస్తూ వారి భవిష్యత్తు కోసం ఎంతటి పోరాటానికైనా సిద్ధమని భరోసా కచ్చారు.

ప్రభుత్వ నిర్ణయం వెనుక పెద్ద కుట్ర?

ఈ సందర్భంగా ఎమ్మెల్యే గంగుల మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వ తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయాల కారణంగానే జీవో నెంబర్ 97 పుట్టుకొచ్చిందని దుయ్యబట్టారు. తాను స్వయంగా ఇంజనీరింగ్ విద్యనభ్యసించిన విషయాన్ని గుర్తుచేస్తూ.. పాలిటెక్నిక్ పూర్తి చేసి నేరుగా ఇంజనీరింగ్ రెండో సంవత్సరంలో ప్రవేశం పొందిన విద్యార్థులు కళాశాలల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరుస్తారని, సాంకేతిక పరిజ్ఞానంలో ఇతరులకన్నా ముందంజలో ఉంటారని స్పష్టం చేశారు. సాంకేతిక విద్యా విధానాన్ని పక్కనపెట్టి పీవీవీ (PVV) మోడల్ పేరుతో కొత్త విధానాన్ని తెరపైకి తెచ్చి, పాలిటెక్నిక్ విద్యను పూర్తిగా ప్రైవేటీకరణ చేసే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. దీనిద్వారా పేద విద్యార్థులకు సాంకేతిక విద్యను దూరం చేసి, కార్పొరేట్ శక్తులకు పట్టం కట్టాలని చూస్తున్నారని విమర్శించారు.

బడా కార్పొరేట్లకు భూముల కట్టబెట్టే యత్నమే!

పాలిటెక్నిక్ విద్యను నిర్వీర్యం చేయడం ద్వారా ఆయా కళాశాలలకు చెందిన రూ.కోట్ల విలువైన ప్రభుత్వ భూములను అదాని, అంబానీ లాంటి బడా కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టే ప్రయత్నంలో భాగంగానే ప్రభుత్వం ఈ జీవోను ప్రకటించిందని గంగుల సంచలన ఆరోపణలు చేశారు. పక్కనే ఉన్న ఏపీలోనూ పాలిటెక్నిక్ విద్యను స్కిల్ యూనివర్సిటీలో విలీనం చేయాలని చూస్తే, విద్యార్థుల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే వెనక్కి తగ్గిందని గుర్తుచేశారు. అదే బాటలో తెలంగాణ ప్రభుత్వం కూడా స్పందించి, విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని జీవో నెంబర్ 97ను బేషరతుగా రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

అసెంబ్లీ వేదికగా పోరాడతాం..

“జీవో నెంబర్ 97 రద్దయ్యే వరకు విద్యార్థుల పక్షాన నిలిచి ఏ క్షణంలోనైనా పోరాటం చేస్తాము. అసెంబ్లీ సమావేశాల్లో ఈ అంశాన్ని ప్రముఖంగా లేవనెత్తి ప్రభుత్వాన్ని నిలదీస్తాం. పేద విద్యార్థుల నోటికాడి బుగ్గిని లాక్కునే ఈ దుర్మార్గపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే వరకు విశ్రమించే ప్రసక్తే లేదు.” – గంగుల

ఈ కార్యక్రమంలో విద్యార్థులతో కలిసి జీవో నెంబర్ 97ను రద్దు చేయాలంటూ పెద్దపెట్టున నినాదాలు చేశారు. ఈ పోరాటంలో విద్యార్థులకు అండగా ఉండి న్యాయం జరిగే వరకు వారి పక్షాన గొంతుక వినిపిస్తానని గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గంగుల వెంట మాజీ గ్రంధాలయ సంస్థ చైర్మెన్ పొన్నం అనిల్ కుమార్ గౌడ్, శాతవాహన యూనివర్సిటీ బీఆర్ఎస్వీ ఇంచార్జ్ చుక్క శ్రీనివాస్, నాయకులు గంగాధర చందు మొగిలోజు వెంకట్, పలువురు బీఆర్ఎస్ విద్యార్థి విభాగం నాయకులు తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>