Mobile Popup Ad
Mobile Popup Ad

బాసర సరస్వతి ఆలయానికి మహర్దశ.. పునర్నిర్మాణంతో కొత్త వైభవం

కలం, నిర్మల్: నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి ఆలయం (Basara Temple) లో చారిత్రాత్మక ఘట్టానికి తెరలేచింది. దక్షిణ భారతదేశంలో ఏకైక సరస్వతి ఆలయంగా ప్రత్యేక గుర్తింపు పొందిన ఈ క్షేత్రం ఇక మహర్దశలోకి అడుగుపెట్టనుంది. దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న ఆలయ పునర్నిర్మాణం, సమగ్ర అభివృద్ధి పనులకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టడంతో భక్తుల్లో కొత్త ఆశలు చిగురించాయి. ఆలయ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం రూ.225 కోట్లతో మాస్టర్ ప్లాన్ రూపొందించి అమలు చేస్తోంది.

ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ క్రమంలో ఆలయ పునర్నిర్మాణ పనులకు అంతరాయం కలగకుండా, ఆగమశాస్త్ర నిబంధనల ప్రకారం ఆదివారం నుంచి పురాతన ఆలయంలో భక్తుల దర్శనాలను తాత్కాలికంగా నిలిపివేయాలని ఆలయ అధికారులు నిర్ణయించారు. అయితే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సరస్వతి మాత దర్శనం కొనసాగేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఆలయ ప్రాంగణంలోని 150 అక్షరాభ్యాస మండపాన్ని తాత్కాలిక బాలాలయంగా మార్చి అక్కడ అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నారు.

వేద పండితుల ఆధ్వర్యంలో కలశారాధన, ప్రత్యేక యాగాలు, శాస్త్రోక్త పూజల అనంతరం ఆదివారం నుంచి భక్తులకు బాలాలయంలో దర్శనం ప్రారంభం కానుంది. ఆలయ ఈవో అంజలీదేవి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు. బాలాలయంలో నిత్యపూజలు, అక్షరాభ్యాస కార్యక్రమాలు యథావిధిగా కొనసాగుతాయని స్పష్టం చేశారు. భక్తుల రద్దీ దృష్ట్యా ప్రత్యేక క్యూలైన్లు, తాగునీరు, విశ్రాంతి సదుపాయాలు, భద్రతా ఏర్పాట్లు కూడా కల్పించినట్లు పేర్కొన్నారు. బాసర ఆలయం తెలంగాణతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల భక్తులకు విశ్వాస కేంద్రంగా ఉంది.

ముఖ్యంగా విద్యారంభం కోసం పిల్లలకు అక్షరాభ్యాసం చేయించేందుకు వేలాది కుటుంబాలు ప్రతి రోజు ఇక్కడికి తరలివస్తుంటాయి. ఈ నేపథ్యంలో పునర్నిర్మాణ పనులు ప్రారంభం కావడం ఆలయ చరిత్రలో కీలక మలుపుగా భావిస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులు ఇప్పుడు ప్రారంభం కావడం సంతోషకరమని, పనులు పూర్తయితే బాసర ఆలయం దేశంలోనే ప్రముఖ విద్యాక్షేత్రంగా మరింత అభివృద్ధి చెందుతుందని భక్తులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. పునర్నిర్మాణం పూర్తయిన తర్వాత ఆలయం మరింత విశాలంగా, ఆధునిక సౌకర్యాలతో భక్తులకు అందుబాటులోకి రానుంది. దీంతో బాసర సరస్వతి మాతకు నిజమైన మహార్దశ ప్రారంభమైందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>