కలం, వెబ్ డెస్క్: ప్రకాశం జిల్లా కొత్తపట్నం మండలం పల్లెపాలెం సముద్రతీరం(Pallepalem Beach)లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. బీచ్ ఒడ్డున వలల షెల్టర్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. చూస్తుండగానే మంటలు వేగంగా వ్యాపించడంతో లోపల ఉన్న వలలు పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించినప్పటికీ వలలన్నీ పూర్తిగా కాలిపోయాయి.
మంటలు పక్కనే ఉన్న పడవలకు కూడా వ్యాపించి ఉంటే ప్రమాదం ఇంకా పెద్దదిగా జరిగేది, అలా జరగకపోవడం మత్స్యకారులకు ఒకింత ఊరట కలిగించింది. ఈ ప్రమాదంలో సుమారు 30మంది మత్స్యకారులకు చెందిన వలలు కాలిపోయాయని సమాచారం. సమాచారం తెలుసుకున్న ఒంగోలు ఎమ్మెల్యే దామంచర్ల జనార్ధన్, జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. నష్టం అంచనా వేసి మత్స్యకారులకు న్యాయం చేసేందుకు ప్రయత్నిస్తామని ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్ తెలిపారు.

