epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

రాష్ట్రంలో పలువురు ఐఏఎస్ అధికారుల బదిలీ

కలం డెస్క్ : రాష్ట్రవ్యాప్తంగా పలువురు ఐఏఎస్ అధికారులు బదిలీ (IAS Reshuffle) అయ్యారు. పనితీరు మెరుగుపర్చుకోవాలంటూ ఐఏఎస్ అధికారులను హెచ్చరించిన రెండు రోజుల వ్యవధిలోనే పలువురి బదిలీ జరగడం గమనార్హం. ఇప్పటివరకూ కీలకమైన బాధ్యతల్లో ఉన్న పలువురిని అప్రాధాన్య శాఖలకు (Loop Line) బదిలీ అయ్యేలా ఉత్తర్వులు జారీ అయ్యాయి. సీఎంఓలో పనిచేస్తున్న పలువురు సీనియర్ అధికారులను సైతం గతంలో నిర్వహించిన శాఖలు సహా సీఎంఓతో సంబంధం లేని శాఖకు బదిలీ అయ్యారు. ప్రతి నెలా అప్రైజల్ రిపోర్టును ఐఏఎస్ అధికారులు సమర్పించాల్సిందేనని, మూడు నెలలకు ఒకసారి స్వయంగా తానే రివ్యూ చేస్తానంటూ క్లారిటీ ఇచ్చిన రోజుల వ్యవధిలోనే ఈ మార్పులు జరగడం ఐఏఎస్ అధికారుల నడుమ చర్చనీయాంశమైంది. క్రిస్మస్ సెలవు రోజున ఉత్తర్వులు జారీకావడంలోని ఆంతర్యమేంటనే గుసగుసలూ మొదలయ్యాయి.

పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యదర్శిగా హరిత :

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యదర్శిగా ప్రియాంక ఆల స్థానంలో సిరిసిల్ల జిల్లా కలెక్టర్ ఎం.హరిత నియమితులయ్యారు. ప్రియాంక ఆల జీహెచ్ఎంసీ ఖైరతాబాద్ జోనల్ కమిషనర్‌గా బదిలీ (IAS Reshuffle) అయ్యారు. ఇంతకాలం సీఎంఓలో ఇండస్ట్రీస్, ఇన్వెస్ట్ మెంట్ సెల్ వ్యవహారాలు చూసిన స్పెషల్ చీఫ్ సెక్రటరీ జయేశ్‌రంజన్‌ను పురపాలక శాఖ స్పెషల్ సీఎస్‌గా (హెచ్ఎండీఏ లిమిట్స్) నియమిస్తూ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఉత్తర్వులు జారీచేశారు. ఈ బాధ్యతలతో పాటు యూత్ ఎఫైర్స్, టూరిజం, కల్చర్ డిపార్టుమెంట్ సెక్రటరీ బాధ్యతలను యధావిధిగా జయేశ్‌రంజన్ చూస్తారు. ఇప్పటివరకూ హెచ్ఎండీఏ బాధ్యతలను చూసిన సీఎస్‌ రిలీవ్ అయ్యారు. సీఎంఓలో ఇంతకాలం జయేశ్‌రంజన్ చూసిన ఇండస్ట్రీస్, ఇన్వెస్ట్ మెంట్ సెల్ వ్యవహారాలను ఇకపైన ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు చూస్తారు. వీరిద్దరి మధ్య పరస్పరం బాధ్యతలు మారాయి.

ఇండస్ట్రీస్, ఇన్వెస్ట్ మెంట్ సెల్ అదనపు సీఈఓగా ఉన్న నర్సింహారెడ్డి మూసీ రివర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఎండీగా నియమితులయ్యారు.

సిరిసిల్ల జిల్లా అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ పూర్తిస్థాయి అదనపు బాధ్యతలతో కలెక్టర్‌గా వ్యవహరించనున్నారు.

ఐటీ, కమ్యూనికేషన్ల శాఖ డిప్యూటీ సెక్రటరీగా ఉన్న భవేష్ మిశ్రా ఇక నుంచి ఇండస్ట్రీస్, ఇన్వెస్ట్ మెంట్ సెల్ అదనపు సీఈఓగా నియమితులయ్యారు.

తెలంగాణ మానవ హక్కుల కమిషన్ కార్యదర్శి/సీఈఓగా పనిచేస్తున్న నిర్మలా కాంతి వెస్లీని కార్మిక ఉపాధి శాఖ డైరెక్టర్‌గా బదిలీ చేశారు.

మైనారిటీ సంక్షేమ శాఖ కార్యదర్శిగా షఫీవుల్లా ఇకపైన తెలంగాణ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్, క్రిస్టియన్ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ వైస్ చైర్మన్, ఎండీగా కూడా వ్యవహరించనున్నారు.

ఇంతకాలం ఈ రెండు కార్పొరేషన్ల బాధ్యతలను చూసిన కాంతి వెస్లీ బదిలీ కావడంతో షఫీవుల్లాకు అదనంగా అప్పగించింది ప్రభుత్వం.

పోస్టింగ్ కోసం వెయిటింగ్‌లో ఉన్న జితేందర్‌రెడ్డి హైదరాబాద్ జిల్లా అదనపు కలెక్టర్‌గా (లోకల్ బాడీస్) బదిలీ అయ్యారు. ఆ స్థానంలో ఉన్న కదిరవన్ అదే జిల్లా రెవెన్యూ విభాగం అదనపు కలెక్టర్‌గా నియమితులయ్యారు.

ఎస్సీ సహకార అభివృద్ధి శాఖ జనరల్ మేనేజర్ హనుమంతనాయక్‌ ఆ శాఖ వైస్ చైర్మన్‌గా, ఎండీగా అదనపు బాధ్యతలు నిర్వర్తించనున్నారు.

భువనగిరి జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) జి.వీరారెడ్డి తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా బదిలీ అయ్యారు.

వికారాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) లింగ్యా నాయక్ రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ కార్యదర్శిగా నియమితులయ్యాయరు. ఇప్పటివరకూ అదనపు హోదాలో ఆ బాధ్యతలు చూస్తున్న మందా మకరందు రిలీవ్ అయ్యారు.

ఈ బదిలీలకు తోడు పలు జిల్లాల్లోని అదనపు కలెక్టర్లను, జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్లను వేర్వేరు జోన్లకు బదిలీ చేస్తూ రామకృష్ణారావు ఉత్తర్వులు జారీచేశారు.

Read Also: హైదరాబాద్‌లో కైట్ ఫెస్టివల్.. ఎప్పటివరకంటే?

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>