కలం, వెబ్ డెస్క్ : హర్యానా (Haryana)లోని నుహ్ జిల్లాలో తీవ్ర కలకలం రేగింది. కేవలం సోషల్ మీడియాలో వ్యూస్, లైక్స్ సంపాదించడం కోసం కొందరు యువకులు చేసిన నిర్వాకం స్థానికంగా తీవ్ర ఆగ్రహానికి దారితీసింది. చారిత్రాత్మక ఘాసేరా గ్రామంలోని గాంధీ పార్కులో ఉన్న మహాత్మా గాంధీ విగ్రహంపైకి ఎక్కి యువకులు రీల్స్ చేయడం, ఫొటోలకు పోజులిచ్చారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ప్రజలు, సామాజిక సంస్థలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి.
జాతిపితను అవమానించేలా ప్రవర్తించిన సదరు యువకులపై చర్యలు తీసుకోవాలని నెటిజన్లు పోలీసులను డిమాండ్ చేశారు. ఈ ఘటనపై నుహ్ పోలీసులు తక్షణమే స్పందించారు. జాతీయ నాయకుల ఆదర్శాలను, విగ్రహాలను గౌరవించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని, ఇలాంటి అగౌరవ పనులను ఏమాత్రం సహించేది లేదని స్పష్టం చేశారు. బాధ్యులైన యువకులపై చట్టపరమైన చర్యలు ప్రారంభించామని, త్వరలోనే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు వెల్లడించారు.

