కలం, వెబ్ డెస్క్ : పశ్చిమాసియాలో ఉద్రిక్తతల కారణంగా ప్రపంచ వ్యాప్తంగా వంట గ్యాస్ కొరత ఏర్పడింది. చాలా చోట్ల ఎల్పీజీ సరిపడా లేకపోవడంతో వంటశాలలు, హోటల్స్ మూతపడ్డాయి. అలాగే, ప్రజలు కూడా గ్యాస్ సిలిండర్ల కోసం ఆందోళన చెందుతున్నారు. ఈ పరిస్థితుల్లో గ్యాస్ అవసరం లేకుండానే 1500 మందికి భోజనం అందిస్తున్న ఫ్లేమ్ లెస్ కిచెన్ (Flameless Kitchen) వార్తల్లో నిలిచింది. మహారాష్ట్రలోని అకోలాకు (Akola) చెందిన ప్రభాత్ స్కూల్ లో ఉన్న సుమారు 1500 మంది విద్యార్థులకు గ్యాస్ అవసరం లేకుండానే భోజనం తయారు చేసి వడ్డిస్తున్నారు. పొలాల్లోని వ్యర్థాలు ఇంధనంగా వాడుతూ పదేళ్లుగా కిచెన్ ను నిర్వహిస్తున్నారు.
పంట పొలాల్లోని వ్యర్థాలే ఇంధనం..
మొదటగా వంట కోసం ఎల్పీజీ గ్యాస్ ను వినియోగించడం వల్ల రోజుకు 4 సిలిండర్లు అవసరమయ్యేవి. దీంతో పాటు వ్యయం కూడా ఎక్కువ అవడంతో పాఠశాల యజామాన్యం ఫ్లేమ్ లెస్ కిచెన్ (Flameless Kitchen) కు మారింది. గ్యాస్ కు బదులుగా పొలాల్లోని వ్యర్థాలను ఉపయోగిస్తున్నారు. వీటిల్లో కంది కట్టెలు, సోయాబీన్ వంటి ఇతర పంటల వ్యర్థాలను తగులబెట్టకుండా వాటిని చిన్న ఉండలుగా మారుస్తారు. వీటితో బాయిలర్ లోని నూనేను వేడెక్కిస్తారు. వేడెక్కిన ఆయిల్ కంప్రెషర్ ద్వారా కిచెన్ లోని పోయ్యిపై ఉన్న కడాయిల వరకు వెళ్తుంది. అమర్చి ఉన్న పైపులైన్ల గుండా ఆయిల్ తిరుగుతూ పాత్రలు వేడెక్కి వంట చేయడానికి అనుకూలంగా మారుతుంది. కాగా, ఈ విధానంతో గ్యాస్ ఉపయోగం లేకపోవడంతో ఇంధన ఖర్చు తగ్గుతుంది. అలాగే, వ్యవసాయ వ్యర్థాలు ఇంధనంగా మార్చడంతో కాలుష్యం కూడా తగ్గే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
Read Also: పర్యాటకంలో కొత్త ట్రెండ్.. నిద్ర కోసమే విహారయాత్రలు!
Follow Us On: Instagram

