కలం, మహబూబ్ నగర్ బ్యూరో: కాలానికి అనుగుణంగా వస్తున్న మార్పులను సైబర్ నేరగాళ్లు గమనిస్తూ ప్రజలను మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నారని జిల్లా ఎస్పీ డి. జానకి (SP Janaki) అన్నారు. గురువారం మహబూబ్‌నగర్ (Mahabubnagar) టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎస్వీడీసీ కళాశాలలో సైబర్ క్రైమ్ నేరాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖా గోయల్, ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ జానకి, ముఖ్యఅతిథిగా హాజరై విద్యార్థులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. సాంకేతిక పరిజ్ఞానం రోజురోజుకూ విస్తరిస్తున్న నేపథ్యంలో మొబైల్ ఫోన్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, సోషల్ మీడియా, డిజిటల్ చెల్లింపుల వినియోగం పెరుగుతోందని, ఇదే సమయంలో సైబర్ నేరగాళ్లు కూడా కొత్త కొత్త పద్ధతులను అనుసరిస్తూ ప్రజలను మోసం చేస్తున్నారని తెలిపారు. ముఖ్యంగా విద్యార్థులు, యువత సైబర్ నేరాల పట్ల పూర్తి అవగాహన కలిగి ఉండాలని సూచించారు.
నకిలీ పెట్టుబడి పథకాలు, స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ పేరుతో మోసాలు, కొరియర్ ఫ్రాడ్, లోన్ యాప్ మోసాలు, క్యూ ఆర్ కోడ్ మోసాలు, ఆన్‌లైన్ ఉద్యోగాల పేరుతో మోసాలు, సోషల్ మీడియా మోసాలు, డిజిటల్ అరెస్ట్ వంటి సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ విద్యార్థులకు సూచించారు. అధిక లాభాలు వస్తాయని చెప్పే అనుమానాస్పద పెట్టుబడి పథకాలను నమ్మి డబ్బులు పెట్టుబడి పెట్టవద్దని తెలిపారు.
ఏదైనా సంస్థ, యాప్ లేదా వ్యక్తి ద్వారా పెట్టుబడికి సంబంధించిన ప్రతిపాదన వచ్చినప్పుడు, ఆ సంస్థకు ప్రభుత్వ అనుమతులు ఉన్నాయా, అధికారిక వెబ్‌సైట్ లేదా యాప్ నిజమైనదేనా, సంబంధిత ఆర్థిక నియంత్రణ సంస్థల అనుమతులు ఉన్నాయా అనే విషయాలను ముందుగా నిర్ధారించుకోవాలని సూచించారు. అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పేవారిని నమ్మి డబ్బులు చెల్లించవద్దని, లాటరీ, గిఫ్ట్, క్యాష్‌బ్యాక్, కస్టమర్ కేర్ తదితర పేర్లతో వచ్చే అనుమానాస్పద కాల్స్, మెసేజ్‌లు, లింకుల విషయంలో జాగ్రత్త వహించాలని సూచించారు.
డిజిటల్ అరెస్ట్” పేరుతో సైబర్ నేరగాళ్లు వీడియో కాల్స్ చేసి పోలీసులు, సీబీఐ, ఈడీ లేదా కోర్టు అధికారులమని పరిచయం చేసుకుని భయపెట్టి డబ్బులు డిమాండ్ చేస్తున్నారని తెలిపారు. పోలీసులు ఎప్పుడూ వీడియో కాల్ ద్వారా ఎవరినీ అరెస్ట్ చేయరని స్పష్టం చేశారు. ఇలాంటి కాల్స్ వస్తే భయపడకుండా వెంటనే పోలీసులను సంప్రదించాలని సూచించారు.
బ్యాంకు ఖాతా నంబర్లు, ఓటీపీ, యూపీఐ పిన్, ఏటీఎం కార్డు వివరాలు, పాస్‌వర్డ్‌లు వంటి వ్యక్తిగత, ఆర్థిక సమాచారాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతరులతో పంచుకోవద్దని తెలిపారు. తెలియని లింకులపై క్లిక్ చేయకూడదని, అనుమానాస్పద యాప్‌లను డౌన్‌లోడ్ చేయకూడదని విద్యార్థులకు సూచించారు. సైబర్ మోసానికి గురైనప్పుడు ఆలస్యం చేయకుండా వెంటనే 1930 సైబర్ హెల్ప్‌లైన్‌కు ఫోన్ చేయాలని ఎస్పీ సూచించారు.
అలాగే నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ ద్వారా ఫిర్యాదు నమోదు చేయాలని తెలిపారు. మోసం జరిగిన వెంటనే ఫిర్యాదు చేయడం ద్వారా మోసపోయిన నగదును నిలిపివేసి తిరిగి పొందే అవకాశాలు మెరుగుపడతాయని వివరించారు. అనంతరం తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో రూపొందించిన సైబర్ భద్రత అవగాహన వీడియోలను విద్యార్థులకు ప్రదర్శించారు. సైబర్ నేరగాళ్లు అనుసరిస్తున్న తాజా విధానాలు, వాటి బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సైబర్ నేరం జరిగినప్పుడు చేపట్టాల్సిన చర్యలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో టూ టౌన్ ఇన్‌స్పెక్టర్ ఇజాజ్‌ఉద్దీన్, సైబర్ క్రైమ్ ఎస్‌ఐ శ్రావణ్ కుమార్, ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

