‎రూ. 60 కోట్లతో ‘కాటమయ్య’ కవచాలు.. నవంబర్ నుంచి రాజీవ్ యువ వికాసం: భట్టి

‎కలం, వెబ్ డెస్క్: రాష్ట్రంలో బీసీ సంక్షేమ పథకాల అమలుకు తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) స్పష్టం చేశారు. ఈ మేరకు సోమవారం ప్రజాభవన్‌లో బీసీ సంక్షేమ శాఖపై ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ.. సంక్షేమ ఫలాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.  ప్రీ-మెట్రిక్, పోస్ట్-మెట్రిక్ స్కాలర్‌షిప్‌ నిధులను నేరుగా విద్యార్థుల బ్యాంక్ ఖాతాల్లోకే (DBT పద్ధతి ద్వారా) జమ చేస్తున్నట్లు వెల్లడించారు.

ఈ నూతన విధానంతో ఇప్పటివరకు 1,30,000 మంది విద్యార్థులకు రూ.450 కోట్ల నిధులను నేరుగా వారి ఖాతాల్లో జమ చేసినట్లు తెలిపారు. అలాగే హాస్టల్ విద్యార్థుల డైట్, కాస్మోటిక్ ఛార్జీలను సైతం ఏ నెలకు ఆ నెల విద్యార్థుల ఖాతాల్లోనే జమ చేయాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు.

గీత కార్మికులకు కాటమయ్య రక్షణ కవచాలు..

‎గీత కార్మికుల సంక్షేమానికి ఉద్దేశించిన ‘కాటమయ్య రక్షణ కవచాలు’ పథకం కింద ఇప్పటివరకు 50 వేల మందికి కిట్స్ మంజూరు కాగా, ఇప్పటికే 40 వేల కిట్లను అందించినట్లు వివరించారు. ప్రస్తుతం శిక్షణ పొందుతున్న మరో 10 వేల మందికి కూడా శిక్షణ పూర్తయ్యాక కాటమయ్య రక్షణ కవచం కిట్లు పంపిణీ చేయాలని నిర్ణయించారు. ఈ పథకం కోసం మొత్తం ₹60 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు డిప్యూటీ సీఎం తెలిపారు.

నవంబర్ నుంచి యువ వికాసం..

రాజీవ్ యువ వికాసం పథకాన్ని నవంబర్ నుంచి ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఈ పథకానికి సంబంధించి స్వీకరించిన దరఖాస్తులను జిల్లా కలెక్టర్ల సమక్షంలో పారదర్శకంగా పరిశీలించి లబ్ధిదారులను ఎంపిక చేయాలని అధికారులను సూచించారు.

ఈ విద్యా సంవత్సరం ఓవర్సీస్ స్కాలర్‌షిప్ పథకం కింద మొదటి, రెండవ విడతల  రూపంలో 180 మంది విద్యార్థులకు రూ.18 కోట్ల 40 లక్షల నిధులను విడుదల చేశామని భట్టి వెల్లడించారు. అర్హులైన విద్యార్థులందరికీ అవకాశం కల్పించేందుకు ఓవర్సీస్ స్కాలర్‌షిప్ దరఖాస్తు గడువును అక్టోబర్ 15 వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటించారు. అదేవిధంగా, బీసీ కుల సంఘాల ఆత్మగౌరవ భవనాల నిర్మాణానికి కూడా త్వరలోనే నిధులు విడుదల చేస్తామని హామీ ఇచ్చారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>